కాంగ్రెస్‌ స్థానంలో బిజెపి...తెరాసతో యుద్దాలు

June 25, 2019


img

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌-తెరాసల మద్యనే ప్రధానంగా రాజకీయ యుద్దాలు జరుగుతుండేవి. కానీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమి, ఫిరాయింపుల కారణంగా బలహీనపడటంతో కాంగ్రెస్‌ స్థానంలో బిజెపి ప్రవేశించి తెరాసతో మాటల యుద్ధాలను ప్రారంభించింది. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఏనాడూ సచివాలయంలో అడుగుపెట్టని సిఎం కేసీఆర్‌కు కొత్త సచివాలయం ఎందుకు?ఐదేళ్ళపాటు ప్రగతి భవన్‌ నుంచే రాష్ట్రాన్ని పాలించారు కదా ఇప్పుడు కూడా అక్కడి నుంచే పాలన సాగించవచ్చు కదా?కేసీఆర్‌ నియంతృత్వ కుటుంబపాలనను అంతమొందించే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. 2023 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో మేమే అధికారంలోకి రాబోతున్నాము. అప్పుడు గోల్కొండ కోటపై కాషాయజెండా ఎగురవేసి, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తాము,” అని అన్నారు.

బిజెపి నేతలు ఈవిదంగా తెరాస ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుండటంతో, ఇంతవరకు సంయమనం పాటించిన తెరాస నేతలు కూడా ధీటుగా జవాబు చెప్పడం ప్రారంభించారు. తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇటీవల కాలంలో బిజెపి నేతలు తమ హద్దులుదాటి మాగురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రతీ అంశాన్ని మతంతో ముడిపెట్టి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టి మా ప్రభుత్వంపైకి ఉసిగొల్పాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బిజెపి నేతల తాటాకు చప్పుళ్ళకు తెరాస భయపడబోదని గ్రహించాలి. ఇకనైనా రాష్ట్ర బిజెపి నేతలు తమ తీరు మార్చుకుంటే మంచిది లేకుంటే ప్రజలే వారికి తగినవిధంగా బుద్ది చెపుతారు,” అని అన్నారు. 


Related Post