కేసీఆర్‌ బాటలో జగన్...కానీ ఓవర్ టేకింగ్

June 25, 2019


img

సిఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమపధకాలు దేశవ్యాప్తంగా ఎంతగా గుర్తింపు పొందాయో అందరికీ తెలుసు. వాటి స్పూర్తితో అటువంటి పధకాలే ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలలో అమలవుతున్నాయి. తాజాగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా సిఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతుబందు పధకం వంటి ‘వైఎస్ఆర్‌ రైతు భరోసా’ పధకం అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. 

ఈ పధకంలో తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ.10,000 చొప్పున పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే చెల్లిస్తుండగా, జగన్ ప్రభుత్వం ఏడాదికి రూ.12,500 చొప్పున కౌలురైతులతో సహా రైతులందరికీ చెల్లించబోతోంది. ముఖ్యంగా ఈ సాయం అత్యంత అవసరమున్న కౌలు రైతులను గుర్తించేందుకు  గ్రామ సచివాలయాలలో దరఖాస్తులను ఏర్పాటు చేస్తామని సిఎం జగన్ చెప్పారు. కౌలు రైతులకు రైతుబందు పధకం వర్తింపజేయడానికి నేటికీ తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తుంటే, కొత్తగా అధికారం చేపట్టిన జగన్ కౌలురైతులకు ఈ పధకంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంపై రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇదేవిధంగా సిఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు భీమా పధకాన్ని పోలిన పధకాన్ని జగన్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ పధకంలో తెలంగాణ ప్రభుత్వం చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లిస్తుంటే, జగన్ ప్రభుత్వం రూ.7.50 లక్షలు చెల్లించబోతోంది. రైతు ఆత్మహత్య చేసుకుంటే, తక్షణమే ఆ జిల్లా కలెక్టర్ ఆ రైతు కుటుంబాన్ని పరామర్శించి వారికి ప్రభుత్వం తరపున భరోసా కల్పించాలి. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి వెళ్ళి ఆ భీమా మొత్తాన్ని స్వయంగా రైతు కుటుంబానికి అందజేయాలి. ఈ విషయం పత్రికలలో రావాలి. ఈ చెల్లింపుల కోసం ప్రభుత్వం ఆదేశాల కోసం ఎవరూ ఎదురుచూడనవసరం లేదని, కలెక్టర్ తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకోవచ్చునని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈరోజు స్పష్టం చేశారు. చనిపోయిన రైతు కుటుంభాన్ని ఎవరైనా వేధిస్తున్నట్లు తెలిస్తే వారిపై కటిన చర్యలు తీసుకోవాలని సిఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. 

సిఎం కేసీఆర్‌ పరిపాలనకు మానవీయకోణాన్ని జోడిస్తే, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి దానికి మరింత మెరుగులు దిద్ది అందరినీ ఆకట్టుకొంటున్నారు. అధికారం చేపట్టి నెలరోజులు తిరక్క మునుపే ఏపీ రాష్ట్ర ప్రజలందరినీ ఆకట్టుకునేవిధంగా నిర్ణయాలు తీసుకొంటూ ఇంతకాలం తనను ద్వేషించిన ప్రజలు సైతం జేజేలు పలికేలా ముందుకు సాగుతున్నారు. కేసీఆర్‌ స్పూర్తితో సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతున్న జగన్, వాటికి మరింత మెరుగులు దిద్ది కేసీఆర్‌ కంటే ముందుకు దూసుకుపోతున్నారు.


Related Post