కూల్చివేతకు కమిటీ... లాంఛనప్రాయమేనా?

June 25, 2019


img

కొత్త సచివాలయం, శాసనసభ, మండలి భవనాలనునిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనసముదాయంతో పాటు దాని పక్కనే ఉన్న మరికొన్ని ప్రభుత్వ భవనాలను కూడా కూల్చివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ప్రతిపక్షాలు అభ్యంతరం చెపుతుండటమే కాకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పుడే హైకోర్టులో పిటిషన్లు కూడా పడుతున్నాయి. 

కనుక సచివాలయం కూల్చివేత, దాని స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణం, సచివాలయంలో పనిచేస్తున్న శాఖల తరలింపు తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించేందుకు మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ సభ్యులుగా ఉన్న ఒక సబ్-కమిటీని సిఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారు. ఆ త్రిసభ్య కమిటీ నేటి నుంచే ఈ అంశాలపై అధ్యయనం చేసి సిఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదిక ఆధారంగా సిఎం కేసీఆర్‌ భవనాల కూల్చివేతపై తుది నిర్ణయం తీసుకుంటారు. 

కొత్త సచివాలయం నిర్మించాలనుకున్నప్పుడే ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం జరిగిపోయింది. అయితే దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైనప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని గట్టిగా సమర్ధించుకోవడానికి ఒక నివేదిక అవసరం కనుకనే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినట్లు భావించవచ్చు. కనుక అది సిఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగానే సచివాలయాన్ని కూల్చివేయాలని నివేదిక ఇవ్వడం ఖాయమేనని భావించవచ్చు. కనుక కమిటీ ఏర్పాటు, నివేదిక అన్నీ లాంఛనప్రాయమేనని భావించవచ్చు.


Related Post