తెరాసపై యుద్ధానికి బిజెపి సన్నాహాలు షురూ?

June 24, 2019


img

గత ఐదేళ్ళపాటు తెలంగాణలో నిద్రావస్థలో జారుకున్న బిజెపికి అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయంతో షాక్ తగిలినట్లు మేల్కొంది. కారణాలు ఏవైతేనేమీ లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకోవడంతో ఆ షాక్ నుంచి తేరుకొని చాలా ఉత్సాహంగా ఉందిప్పుడు.

లోక్‌సభ ఎన్నికలలో కాస్త గట్టిగా ప్రయత్నిస్తే  బిజెపికి ఏమాత్రం బలం లేని పశ్చిమబెంగాల్లో 18 సీట్లు గెలుచుకోగలిగినప్పుడు, బిజెపికి చాలా బలం ఉన్న తెలంగాణలో ఎందుకు గెలుచుకోలేము? అనే ఆలోచన బిజెపి అధిష్టానానికి కలిగింది. అదే సమయంలో తెలంగాణలో బిజెపి నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో బిజెపి అధిష్టానం వైఖరిలో మార్పువచ్చినట్లే కనబడుతోంది.   

తెలంగాణలో బిజెపి ఎదుగుదలకు అడ్డంకిగా మారిన కేసీఆర్‌తో మోడీ దోస్తీని తగ్గించుకొని రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు సహకరించాలని బిజెపి అధిష్టానం నిర్ణయించినట్లు రాష్ట్ర బిజెపి నేతల మాటలను బట్టి అర్ధం అవుతోంది. గతంలో తెరాస సర్కార్ పట్ల మెతకవైఖరితో వ్యవహరించిన బిజెపి నేతలే ఇప్పుడు సిఎం కేసీఆర్‌కు సవాళ్ళు విసురుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఆత్మవిశ్వాసంతో చెపుతున్నారు. కేంద్రప్రభుత్వం, బిజెపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునే వారు తెరాసతో యుద్ధానికి సిద్దం అవుతున్నారని స్పష్టం అవుతోంది.

తెరాస సర్కారుపై యుద్ధసన్నాహాలలో భాగంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ నేతృత్వంలో హైదరాబాద్‌లోని ఒక హోటల్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాని అజెండా కేసీఆర్‌ లక్ష ఉద్యోగాల హామీపై చర్చ. ఈ సమావేశానికి బిజెపి నేతలతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య, మేధావులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఐదున్నరేళ్ళు గడిచిపోయినా సిఎం కేసీఆర్‌ లక్ష ఉద్యోగాల భర్తీ చేయలేకపోయారని కె. లక్ష్మణ్ విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ పోస్టులకు 20 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారంటే దానార్ధం రాష్ట్రంలో అంతమంది నిరుద్యోగులు ఉన్నారని, కానీ కేసీఆర్‌ మాత్రం ఉద్యోగాల భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏవిధంగా అందరూ కలిసి ఉద్యమాలు చేశారో, ఇప్పుడు ఉద్యోగాల భర్తీ కోసం కూడా అదేవిధంగా ఉద్యమించడానికి అందరూ సిద్దం కావాలని లక్ష్మణ్ అన్నారు. అంటే తెరాసతో యుద్ధానికి బిజెపి ఒక బలమైన కారణం కనుగొన్నట్లే చెప్పవచ్చు.


Related Post