తరువాత కూల్చబోయేది బాబు నివాసమేనా?

June 24, 2019


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం ఉండవల్లిలో ప్రజావేదిక భవనంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రజావేదిక భవనానికి, దాని సమీపంలోనే మాజీ సిఎం చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్న భవనానికి ఎటువంటి అనుమతులు లేవని, అవొక అక్రమకట్టడాలని సీర్‌ఆర్‌డీఏ నివేదికను ప్రస్తావించిన జగన్, “ఒక సామాన్య పౌరుడు ఇల్లు కట్టుకునేటప్పుడు చిన్నపాటి అతిక్రమణకు పాల్పడితే వెంటనే మనమందరం వెళ్ళి ఆ ఇంటిని కూల్చివేస్తాము. కానీ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా నిలువ వలసిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి, ప్రభుత్వమే నిబందనలను పట్టించుకోకుండా అక్రమకట్టడాలు నిర్మిస్తే ఎలా?చట్టానికి ఎవరూ అతీతులు కారు. ఎటువంటి అనుమతులు లేకుండా, నిబందనలకు విరుద్దంగా నిర్మించబడిన ఈ భవనంలో మనమంతా కూర్చొని నీతి, నిజాయితీ, సుపరిపాలన అంటూ మాట్లాడితే ప్రజలు నవ్వుతారు. కనుక ఈ భవనంలో జరిగే చివరి సమావేశం ఇదేనని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ భవనాన్ని కూల్చివేయాలని నిర్ణయించాను. బుదవారం నుంచే ఆ పని మొదలవుతుంది. ఇదొక్కటే కాదు...రాష్ట్రంలో ఎక్కడ అక్రమకట్టడాలు నిర్మించినా వాటిని కూల్చివేయాలని అందరినీ కోరుతున్నాను. అవి ఎంత పెద్దవారికి చెందినవైనా ఉపేక్షించనవసరం లేదు,” అని అన్నారు. 

ఉండవల్లిలో చంద్రబాబునాయుడు నివాసం కూడా అక్రమకట్టడమేనని సీర్‌ఆర్‌డీఏ నివేదికలో పేర్కొంది. కనుక ప్రజావేదిక భవనం తరువాత ఆయన నివాసం కూల్చివేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ జగన్ ప్రభుత్వం చంద్రబాబునాయుడు నివాసమే కూల్చివేయదలిస్తే, రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల భవనాలను విడిచిపెడతారనుకోలేము. జగన్ నిర్ణయం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.


Related Post