రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కాదట!

June 24, 2019


img

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై బిజెపి గట్టిగానే దృష్టి పెట్టినట్లుంది. ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతలు డికె అరుణ, పొంగులేటి సుధాకర్ బిజెపిలో చేరగా త్వరలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారు. ఇదేపని మీద ఆయన సోమవారం డిల్లీ బయలుదేరి వెళ్లారు. బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డాను కలిసి మాట్లాడినా తరువాత బిజెపిలో చేరబోతున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల 28న ఆయన బిజెపిలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తాజా సమాచారం. ఆయన ఒకరే కాదు... సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ లను కూడా బిజెపిలో చేర్చుకునేందుకు తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఊహాగానాలను వారివురు ఖండించారు.

వారిరువురి సంగతి ఎలా ఉన్నా రాజగోపాల్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరుతారా లేదా? అనేది ఆసక్తికరం. ఒకరు కాంగ్రెస్‌లో, మరొకరు బిజెపిలో కొనసాగడం వారిరువురికీ కూడా చాలా ఇబ్బందికరంగా మారుతుంది కనుక వెంకట్ రెడ్డి కూడా బిజెపిలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. జూలై 6 నుంచి రాష్ట్రంలో బిజెపి సభ్యత్వనమోదు కార్యక్రమం మొదలవుతుంది. అప్పటి నుంచే ఇతర పార్టీల నేతల వలసలు కూడా ఉంటాయని స్వయంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ చెపుతున్నారు. కనుక ఈ సమస్యను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోగలదో లేదో చూడాలి.


Related Post