కొత్త సచివాలయ నిర్మాణానికి 27న టెండర్లు?

June 24, 2019


img

ఈనెల 27న కొత్త సచివాలయానికి, కొత్త శాసనసభ, మండలి భవనాలకు సిఎం కేసీఆర్‌ శంఖుస్థాపన చేయబోతున్న సంగతి తెలిసిందే. పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం, ఎర్రమంజిల్ వద్ద శాసనసభ, మండలి భవనాలను నిర్మించబోతున్నట్లు సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

వీటి నిర్మాణాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నందున, అనుకున్న సమయానికి అత్యద్భుతంగా ప్రగతి భవన్‌ను నిర్మించి ఇచ్చిన షాపూర్‌జీ- పల్లోంజీ సంస్థకే వీటి నిర్మాణబాధ్యతలను అప్పగిస్తే ఎలా ఉంటుందని సిఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ నామినేషన్ పద్దతిలోరూ.500 కోట్లు విలువగల పనులు ఒక ప్రైవేట్ సంస్థకు కట్టబెడితే, ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కనుక అవసరమైతే జూన్ 27న గ్లోబల్ టెండర్లు పిలవాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై లోతుగా చర్చించేందుకు సిఎం కేసీఆర్‌ నేటి నుంచి మూడు రోజుల పాటు సంబందిత శాఖల అధికారులు, మంత్రులతో సమావేశం కానున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయం, శాసనసభ భవనాలను నిర్మించబోతోందని తెలుసుకున్న చెన్నైకి చెందిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్ట్‌ సంస్థ కూడా దీర్గ చతురస్రాకారంలో ఉండే ఒక డిజైన్‌ను పంపించింది. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ సంస్థ హఫీజ్ కంట్రాక్టర్ చాలా నెలల క్రితమే కొత్త సచివాలయానికి ఒక డిజైన్ ఇచ్చింది. రెంటినీ సిఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. ఆ రెండు డిజైన్లలో ఏదో ఒక దానిని ఎంపిక చేసుకోవాలా లేదా మళ్ళీ కొత్త డిజైన్ తయారు చేయించాలా?అనే అంశంపై ఈ సమావేశంలో అధికారులతో చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటారు. 

కొత్త సచివాలయం విశాలంగా, సౌకర్యవంతంగా, ఆధునికంగా ఉండాలంటే పాత భవనాలను వాటి చుట్టూ ఉన్నభవనాలను కూడా కూల్చివేయక తప్పదని మంత్రుల కమిటీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 27వ తేదీ నాటికి కొత్త సచివాలయం, కొత్త శాసనసభ, మండలి భవనాల నిర్మాణాలపై కొంత స్పష్టత రావచ్చు. 


Related Post