తెరాసకు ఆ పరిస్థితి రావచ్చు: షబ్బీర్ ఆలీ

June 22, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ ఆలీ తెరాస, బిజెపిలను ఉద్దేశ్యించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నరేంద్రమోడీ నాయకత్వంలో బిజెపి ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించుకొంటూ వస్తోంది. ఏపీలో టిడిపిని పక్కకు తప్పించినట్లే ఏదో ఓ రోజు తెలంగాణలో తెరాసను కూడా పక్కకు తప్పించవచ్చు. కనుక తెలంగాణ ప్రజల తరపున నిలబడి బిజెపితో పోరాడగలిగే శక్తి జాతీయపార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది,” అని అన్నారు. 

గత ఐదేళ్ళలో బిజెపి మెల్లగా ఈశాన్యరాష్ట్రాలకు విస్తరించగలిగింది. తమిళనాడులో జయలలిత మరణంతో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకొని కేంద్రం చెప్పుచేతలలో ఉండే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోగలిగింది. అదేవిధంగా ఆ మద్య శబరిమలై ఆలయంలోకి మహిళల ప్రవేశం అంశంపై రాజకీయాలు చేసి కేరళలో తన ఉనికిని చాటుకొని బలపడేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది.ఇప్పటికే కర్ణాటకలో బలంగా ఉంది కనుక అక్కడ కాంగ్రెస్‌-జెడిఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బిజెపి తెర వెనుక ప్రయత్నాలు చేస్తూనే ఉందని రోజూ వార్తలలో చూస్తూనే ఉన్నాము. ఇక లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో నాలుగు సీట్లు గెలుచుకొని మళ్ళీ బలపడినప్పటి నుంచి బిజెపి నేతలు అధికార తెరాసకు సవాళ్ళు విసురుతుండటం, వచ్చే ఎన్నికల నాటికి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని చెప్పడం అందరూ చూస్తూనే ఉన్నారు. 

అలాగే ఏపీలో వైసీపీకి పరోక్షంగా సహాయసహకారాలు అందించి చంద్రబాబునాయుడును ఇంటికి పంపించగలిగింది. లోక్‌సభ ఎన్నికలతో పశ్చిమబెంగాల్, ఆంధ్రా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో అడుగుపెట్టేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలలో బెంగాల్లో మాత్రం సఫలం అయ్యింది. మిగిలిన మూడు రాష్ట్రాలలో దాని ప్రయత్నాలు ఫలించలేదు. అది వేరే సంగతి. కానీ బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో కూడా ఏదో విధంగా విస్తరించి అధికారం చేజిక్కించుకోవడానికి బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఏపీ రాజకీయాలలో కులప్రభావం చాలా ఎక్కువ కనుక అక్కడ ఆవిధంగానే ప్రయత్నాలు చేస్తూ బలపడేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టింది. తెలంగాణ రాజకీయాలలో కులప్రభావం కాస్త తక్కువే కనుక ఇక్కడ భిన్నమైన వ్యూహంతో కాంగ్రెస్‌, టిడిపి నేతలను బిజెపిలో చేర్చుకొంటూ రాష్ట్రంలో బలపడే ప్రయత్నాలు చేస్తోంది. 

కనుక షబ్బీర్ ఆలీ చెప్పినట్లు ఏనాటికైనా తెరాసను కబళించేందుకు బిజెపి ప్రయత్నించకమానదు. ఈవిషయం సిఎం కేసీఆర్‌ కూడా గ్రహించినట్లే ఉన్నారు. అందుకే తమిళనాడులో డీఎంకె, అన్నాడీఎంకెల పార్టీల మాదిరిగా గ్రామస్థాయి నుంచి బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు.


Related Post