పూర్తికాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవమా? దత్తన్న ప్రశ్న

June 22, 2019


img

సిఎం కేసీఆర్‌ నిన్న అట్టహాసంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేయడంపై మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పందిస్తూ, “ ఆ ప్రాజెక్టులో కేవలం 20 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 30 శాతం పనులు ఇంకా జరుగుతున్నాయి. మిగిలిన 50 శాతం పనులకు ఇంతవరకు భూసేకరణ కూడా జరుగలేదు. పూర్తికాని ప్రాజెక్టుకు ఎవరైనా ప్రారంభోత్సవం చేస్తారా? పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో కేసీఆరే. పైగా కాళేశ్వరం ప్రాజెక్టును తానే పూర్తి చేశానని గొప్పగా చెప్పుకొంటూ ప్రచారం చేయించుకుంటున్నారు. సిఎం కేసీఆర్‌కు ప్రచారారార్బాటం చాలా ఎక్కువైపోయింది,” అని ఎద్దేవా చేశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ఇంకా పూర్తికావలసిన మాట వాస్తవం. ఇది ఏ విద్యుత్ లేదా రోడ్డు ప్రాజెక్టు అయ్యుంటే దత్తన్న, కాంగ్రెస్‌ నేతలు చెపుతున్నట్లు 100 శాతం నిర్మాణపనులు పూర్తిచేసిన తరువాతే ప్రారంభోత్సవం చేసుకోవచ్చు. కానీ ఇది సాగునీటి ప్రాజెక్టు. కనుక 100 శాతం నిర్మాణం పూర్తయ్యేవరకు కాళేశ్వరం ప్రాజెక్టును నిలిపి ఉంచడం సాధ్యం కాదు.

ఎందుకంటే వర్షాలు మొదలవగానే భారీగా నీటి ప్రవాహం మొదలవుతుంది. అప్పుడు తప్పనిసరిగా గేట్లను తెరిచి ఆ నీటిని ఎత్తిపోయవలసి ఉంటుంది. లేకుంటే ప్రాజెక్టుకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే యుద్ధప్రాతిపదికన అవసరమైన మేర పనులు పూర్తిచేసి సిఎం కేసీఆర్‌ ప్రారంభోత్సవం చేశారు. ఒకవేళ ప్రారంభోత్సవం చేయకపోయినా తప్పనిసరిగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తూనే ఉండాలి కనుక ఎప్పుడో ప్రారంభోత్సవం చేయాలనుకుంటే అప్పటికి అన్నీ పాతబడిపోతాయి. ఎవరైనా కొత్త ప్రాజెక్టుకే ప్రారంభోత్సవం చేస్తారు తప్ప పాత ప్రాజెక్టుకు చేయరనే సంగతి దత్తన్న, కాంగ్రెస్‌ నేతలు గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post