ఇపుడు జమిలి ఎన్నికలు గుర్తొచ్చాయా?

June 19, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన డిల్లీలో కొద్ది సేపటి క్రితం అఖిలపక్ష సమావేశం ప్రారంభం అయ్యింది. పార్లమెంటులో ఒక సభ్యుడు ఉన్న పార్టీని సైతం ఈ సమావేశానికి మోడీ సర్కార్ ఆహ్వానించింది. స్వపక్షం, విపక్షం అనే భేదభావం చూపకుండా అందరూ కలిసికట్టుగా దేశాభివృద్ధికి కృషి చేద్దామనే ఆలోచనతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు బిజెపి చెపుతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, నితీశ్ కుమార్, నవీన్ పట్నాయక్, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు వివిద రాష్ట్రాలకు చెందిన అనేక పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు. 

ఈ సమావేశంలో జమిలి ఎన్నికల గురించి చర్చించబోతున్నట్లు సమాచారం. గతంలో కూడా ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రతిపాదన చేశారు. కానీ ఆచరణలో పెట్టలేకపోయారు. జమిలి ఎన్నికల వలన ప్రజాధనం వృధా కాకుండా నివారించవచ్చునంటూ వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి చాలా మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీయే తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలను అనుమతించారు. మళ్ళీ ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నరేంద్రమోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి సిఎం కేసీఆర్‌ ప్రజాధనం వృదా చేశారని విమర్శలు గుప్పించారు. 

ప్రధాని నరేంద్రమోడీ చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు ఆచరించని వాటి గురించి ఎన్నికలు పూర్తయ్యాక సమావేశాలు పెట్టుకొని మాట్లాడుకుంటే ఏమి ప్రయోజనం?కనుక మళ్ళీ ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహిస్తున్న ఈ సమావేశంలో జమిలి ఎన్నికల కంటే దేశాభివృద్ధికి దోహదపడే  ముఖ్యమైన అంశాల గురించి, ఉద్యోగాల కల్పన, త్రాగునీరు, రైతుల సమస్యలు, మౌలిక సదుపాయాలు, ఉద్యోగాల కల్పన వంటి వాటి గురించి లోతుగా చర్చించి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుచేస్తే బాగుంటుంది.


Related Post