కాళేశ్వరం అదనపు పనులకు అనుమతి మంజూరు

June 19, 2019


img

మేడిగడ్డ బ్యారేజీ నుంచి రోజుకు 2 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోయాలనేది ఇప్పటి వరకు ఉన్న ప్రతిపాదన. అయితే మరొక టీఎంసీ నీళ్ళు ఎత్తిపోయగలిగితే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సామార్ధ్యంతో వినియోగించుకోవచ్చుననే అధికారులు, ఇంజనీర్లు, సాగునీటి నిపుణుల ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దీనికోసం అదనంగా పైప్ లైన్లు వేసి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజిల వద్ద అదనంగా మోటర్లు బిగించవలసి ఉంటుంది. వాటికిఅవసరమైన అదనపు నిధులు మంజూరు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం మేడిగడ్డ (11), అన్నారం (8), సుందిళ్ళ  పంప్‌హౌస్‌లో (9) మోటర్లు కలిపి మొత్తం 28 మోటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు వాటికి అదనంగా మరో 15 మోటర్లు బిగించనున్నారు. మిడ్‌మానేరు నుంచి మల్లన్న సాగర్‌కు నీటిని టన్నెల్ ద్వారా తరలించాలని భావించి పనులు చేస్తునప్పటికీ సొరంగా మార్గం పనులు ఆలస్యం అవుతున్నందున పైప్‌లైన్‌ ద్వారా నీటిని తరలించాలనే ప్రతిపాదనకు, దానికయ్యే రూ.14,362 కోట్లు అదనపు వ్యయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఈ ఏడాదికి రోజుకు 2 టీఎంసీల చొప్పున నీళ్ళు ఎత్తిపోసుకొని, ఈ అదనపు పనులన్నీ పూర్తి చేసి వచ్చే ఏడాది నుంచి రోజుకు 3 టీఎంసీలు నీళ్ళు ఎత్తిపోసుకోవాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం ఇప్పుడు రూ. 84,362 కోట్లకు పెరిగింది.


Related Post