ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు అనివార్యమేనా?

June 19, 2019


img

లోక్‌సభ ఎన్నికల సమయంలో సిఎం కేసీఆర్‌తో సహా తెరాస నేతలందరూ ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ చాలా హడావుడి చేశారు. ఒకవేళ వారి అంచనాలు ఫలించి కేంద్రంలో హంగ్ ఏర్పడితే నేడు కేసీఆర్‌ డిల్లీలో ఉండేవారేమో కానీ మళ్ళీ బిజెపి భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనలన్నీ అటకెక్కించక తప్పలేదు. అయితే దాని గురించి మళ్ళీ సిఎం కేసీఆర్‌ నిన్న ప్రస్తావించడం విశేషం. 

ప్రగతి భవన్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “నేటికీ మన దేశానికి ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం ఉందని నేను భావిస్తున్నాను కనుక దానికి కట్టుబడే ఉన్నాను. రాష్ట్రాల పట్ల కేంద్రం వైఖరిలో మార్పు రానంతవరకు ఫెడరల్‌ ఫ్రంట్‌ అవసరం ఉందనే నేను భావిస్తున్నాను. మేము ఎన్డీయేలో భాగస్వామి కాదు కనుక కేంద్రప్రభుత్వం మంచిపనులు సంకల్పించినప్పుడు మద్దతు ఇచ్చాము. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యతిరేకించాము. ఇప్పుడూ అదేవిధంగా వ్యవహరిస్తాము. అక్కడ మోడీకి, ఇక్కడ నాకు ప్రజలు అధికారం ఇచ్చారు కనుక అక్కడ ఆయన ఇక్కడ నేను చేయవలసిన పనులు చేస్తుంటాము. రాజ్యాంగబద్దంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య ఎటువంటి సంబంధాలు ఉండాలో ఆవిధంగానే ఉంటాయి. దానికీ రాజకీయాలకు సంబందం లేదు. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే నీతి ఆయోగ్ మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ ప్రాజెక్టులకు రూ.24,000 కోట్లు మంజూరు చేయాలని చెప్పింది. కానీ కేంద్రప్రభుత్వం రూ.24 కూడా ఇవ్వలేదు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే సంతోషిస్తాం లేకుంటే మా తిప్పలు మేము పడతాము. కేంద్రం సహకరించినా సహకరించకపోయినా రాష్ట్రాభివృద్ధి పనులు మాత్రం ఆగవు,” అని అన్నారు.

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన ప్రస్తుతానికి అటకెక్కించవలసి వచ్చినప్పటికీ, ఒకవేళ కేంద్రప్రభుత్వం తెరాస ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తే, దానిని అడ్డుకునేందుకు కేసీఆర్‌ తప్పకుండా ఫెడరల్‌ ఫ్రంట్‌ను అటక మీద నుంచి దింపి, ప్రతిపక్షాలను, బిజెపియేతర ప్రభుత్వాలను కూడగట్టి ఎదుర్కొనే ప్రయత్నం చేయవచ్చు.  



Related Post