లక్ష్మణ్ చెపుతున్న ఆ బాహుబలి హరీష్ రావేనా?

June 18, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చిన తరువాత  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం చూస్తున్నది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. జూలై 6వ తేదీ నుంచి రాష్ట్రంలో పార్టీ సభ్యత్వనమోదు కార్యక్రమం మొదలవుతుంది. అప్పటి నుంచి ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నేతలు బిజెపిలో చేరానున్నారు. వారిలో ఒకరిద్దరు బాహుబలులు కూడా ఉంటారు. తెరాసకు మేమే ప్రత్యామ్నాయమని ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. కనుక వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా పని చేస్తాము,” అని అన్నారు. 

గతంలో సీనియర్ కాంగ్రెస్‌ నేత జానారెడ్డి కూడా తమ పార్టీలోకి ‘బాహుబలి’ వంటి గొప్ప నాయకుడు రాబోతున్నాడని చెప్పారు. అతనే ఎన్నికలలో పార్టీని గట్టెక్కిస్తారన్నట్లు మాట్లాడారు. రేవంత్‌ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్ప ఏ బాహుబలి చేరలేదు. వారిద్దరిలో ఒకరు అసెంబ్లీ ఎన్నికలలో మరొకరు లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయారు. ఇప్పుడు తనను కాపాడగలిగే బాహుబలి కోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఎదురుచూస్తోంది. 

కాంగ్రెస్‌ను కాపాడలేనివారు బిజెపిలో చేరితే బాహుబలి కాలేరు కనుక ఇక తెరాస నుంచే ఆ బాహుబలి రావలసి ఉంటుంది. తెరాస నుంచి ఇప్పటికే జితేందర్ రెడ్డి వచ్చారు. ఇంకా ఎవరు వస్తారో తెలియదు. ఒకవేళ కె. లక్ష్మణ్ చెపుతున్న ఆ బాహుబలి హరీష్‌రావా? లేక మరెవరైనా ఉన్నారా? వారిని బిజెపిలోకి రప్పించడానికి తెర వెనుక ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? కె. లక్ష్మణ్ చెపుతున్న ఆ బాహుబలి హరీష్ రావే అయితే తెలంగాణలో తెరాస-బిజెపి బలాబలాలు మారవచ్చు.


Related Post