ముందుజాగ్రత్త కోసమే ఫిరాయింపులు: కాంగ్రెస్‌

June 18, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత దామోదర రాజనర్సింహ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఈరోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “తెరాసకు శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ సిఎం కేసీఆర్‌ ఇంకా మా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఎందుకు తెరాసలోకి ఫిరాయింపజేసుకొంటున్నారంటే నరేంద్రమోడీని చూసి భయంతోనే. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్‌రెడ్డిని ప్రధాని నరేంద్రమోడీ కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా నియమించడాన్ని సిఎం కేసీఆర్‌ తొలి హెచ్చరిక అని గుర్తించినట్లే ఉన్నారు. ఏనాటికైనా నరేంద్రమోడీ, రాష్ట్ర బిజెపి వలన తన ప్రభుత్వానికి ప్రమాదం ఏర్పడవచ్చుననే భయంతోనే సిఎం కేసీఆర్‌ ముందు జాగ్రత్త చర్యగా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింప జేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి సిఎం కేసీఆర్‌ వెళ్ళకపోవడం వారిరువురి మద్య దూరం పెరుగుతోందనే సంకేతంగా భావించవచ్చు. 

మా పార్టీలో చాలా మంది నేతలకు మా పార్టీ కంటే తెరాసపైనే మక్కువ ఎక్కువ. వారి వలననే మాపార్టీ తీవ్రంగా నష్టపోయింది. మేము తెరాసను మా మిత్రపక్షంగా భావించి మోసపోయాము లేకుంటే నేడు మా పార్టీకి ఈ దుస్థితి కలిగి ఉండేదే కాదు. ఏపీలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఏ పార్టీలో ఉన్నప్పటికీ రాణించగలుగుతున్నారు కానీ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు రాణించలేకపోతున్నారో వారే ఆలోచించుకోవాలి. టిపిసిసి అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టినప్పటికీ వైసీపీ అధినేత, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పోరాటస్పూర్తిని చూసి నేర్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి మేలుకలుగుతుంది,” అని అన్నారు. 

రాష్ట్ర బిజెపి నేతల మాటలు, వారు తెరాసకు విసురుతున్న సవాళ్లను వింటున్నట్లయితే సిఎం కేసీఆర్‌ పట్ల కేంద్రప్రభుత్వం వైఖరిలో మార్పు వచ్చిందని స్పష్టం అవుతోంది. కిషన్‌రెడ్డి కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెరాస మజ్లీస్ పార్టీలపై చేసిన వ్యాఖ్యలు కూడా అదే సూచిస్తున్నాయి. రానున్న రోజులలో కేసీఆర్‌ సర్కారుకు గట్టి సవాళ్ళు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లే కనిపిస్తోంది. కనుక కేసీఆర్‌ ముందు జాగ్రత్తపడాలనుకోవడం సహజమే. 

పదేళ్ళుగా ఏపీలో టిడిపి ప్రభుత్వం నుంచి ఎన్ని సవాళ్ళు, సమస్యలు, అవమానాలు, వేధింపులు ఎదురైనప్పటికీ జగన్ ఏమాత్రం వెనుకంజవేయకుండా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నారు. చివరికి అధికారం చేజిక్కించుకోగలిగారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పటికీ, మళ్ళీ అధికారం దక్కించుకోలేకపోయింది. నేటికీ తెలంగాణ కాంగ్రెస్‌లో రెడ్లదే పైచెయ్యిగా ఉంటునప్పటికీ, వారెవరూ కాంగ్రెస్ పార్టీని కాపాడలేక చేతులెత్తేస్తున్నారు. అందుకు రాజనర్సింహ చెప్పిన కారణాలు సరైనవే. ప్రస్తుత పరిస్థితులలో ఎవరు కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టినప్పటికీ జగన్ పోరాటస్పూర్తిని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తే బాగుంటుందని రాజనర్సింహ చెపుతున్న సలహా కూడా ఆచరణీయమే.


Related Post