నేను పార్టీ మారుతానని చెప్పలేదు: రాజగోపాల్ రెడ్డి

June 18, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం రాత్రి డిల్లీ వెళ్ళడంతో ఆయన బిజెపి పెద్దలను కలిసేందుకే వెళ్ళారని సోషల్ మీడియాలో జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన వాటిని ఖండిస్తూ, “నా సోదరుడు వెంకట్‌రెడ్డి ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకే నేను డిల్లీ వచ్చాను తప్ప ఎవరినీ కలవడానికి కాదు. అయినా నేను పార్టీ మారుతానని చెప్పలేదు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాను అంతే. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే నల్గొండలో మా అనుచరులతో చర్చించి వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటాను. కేవలం నాయకత్వలోపం కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బ తిందని మళ్ళీ చెపుతున్నాను. అందుకే విజయావకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. చివరికి పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్దకంగా మారింది. ఇదే చెప్పాను తప్ప పార్టీ మారుతానని చెప్పలేదు. నేను పార్టీ మారడం గురించి మీడియాలో వస్తున్నవన్నీ ఊహాగానాలే,” అని అన్నారు. 

మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం అంటే పార్టీని వీడేందుకు సిద్దమని సంకేతం ఇవ్వడమే. ఒకవేళ రాజగోపాల్ రెడ్డికు అటువంటి ఉద్దేశ్యంలేనట్లయితే ఈ సమస్యల గురించి పార్టీ అంతర్గత సమావేశంలో మాట్లాడి ఉండేవారు. 

పార్టీ చేత వేటు వేయించుకొని బిజెపిలో చేరితే ఇబ్బంది ఉండదని రాజగోపాల్ రెడ్డి, ఆయనపై వేటు వేస్తే పార్టీ మారేందుకు మార్గం కల్పించినట్లవుతుందనే భయంతో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తున్నారు. అందుకే ఆయన పార్టీపై అంత తీవ్రవిమర్శలు చేసినా వేటు వేయకుండా షోకాజ్ నోటీస్ పంపించడానికి కాంగ్రెస్‌ సిద్దం అవుతోంది. వేటు వేయడానికి కాంగ్రెస్‌ పార్టీ ఇంకా సంకోచిస్తూ కూర్చుంటే రాజగోపాల్ రెడ్డి మరోసారి పార్టీ అధిష్టానంపై తీవ్ర విమర్శలు చేయడం తధ్యం. బహుశః రెండు మూడు రోజులలోనే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చి ఆయన బిజెపి కండువా కప్పుకోవచ్చు. 


Related Post