హనుమంతన్న కుప్పి గంతులు దేనికో?

June 18, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు మంగళవారం తెల్లవారుజామున పంజగుట్ట చౌరస్తాలో హడావుడి చేశారు. గతంలో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్టించిన చోటే మళ్ళీ కొత్త విగ్రహం ప్రతిష్టించేందుకు సిద్దం కాగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకొని ఆయనను అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దాంతో ఆయన వారికి చిక్కకుండా తప్పించుకునేందుకు పంజగుట్ట చౌరస్తాలో కాసేపు అటుయిటూ పరుగులు తీసి, హడావుడి చేసారు. ఆ తరువాత నడిరోడ్డుపై ధర్నాకు కూర్చున్నారు. పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సిఎం కేసీఆర్‌కు బడుగు బలహీనవర్గాల పట్ల గౌరవభావం లేదని అందుకే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించడాన్ని ప్రభుత్వం అడ్డుకుంటోందని వి.హనుమంతరావు అన్నారు. 

ఈ వయసులో వి.హనుమంతరావు ఈవిధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అనే సందేహం కలుగకమానదు. దానికి ఒక బలమైన కారణం కనిపిస్తోంది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఇటీవల మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించి పార్టీ వీడబోతున్నట్లు సంకేతాలు ఇవ్వడంతో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. పిసిసి అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న వి.హనుమంతరావు కూడా  బహుశః ఆ పదవి కోసం ఆరాటపడుతున్నారేమో? కనుక నేటికీ తనలో పోరాటపటిమ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునేందుకే బహుశః ఈవిధంగా హడావుడి చేస్తున్నారేమో? ఒకవేళ ఆయన బడుగుబలహీనవర్గాల శ్రేయస్సు కోరుకొంటున్నట్లయితే వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తే అందరూ హర్షిస్తారు కానీ ఈవిధంగా రోడ్ల మీద హడావుడి చేస్తే ప్రజల దృష్టిలో చులకనవుతారని గ్రహిస్తే మంచిది.


Related Post