విభజన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోగలరా?

June 17, 2019


img

ఈరోజు ఏపీ, తెలంగాణ సిఎంలు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ తాడేపల్లిలో భేటీ అయ్యారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా సిఎం కేసీఆర్‌ జగన్‌ను ఆహ్వానించారు. జగన్‌మోహన్‌రెడ్డి కేసీఆర్‌, కేటీఆర్‌లకు శాలువాలు కప్పి సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వారిరువురూ విభజన సమస్యలు, ఉద్యోగులు, నీతి పంపకాలపై క్లుప్తంగా చర్చించి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొందామని నిర్ణయించారు. ముందుగా ఈనెల 24న రెండు రాష్ట్రాల ప్రధానకార్యదర్శుల సమక్షంలో జలవనరులశాఖల ముఖ్య కార్యదర్శులు హైదరాబాద్‌లో సమావేశం అవ్వాలని నిర్ణయించారు.  

గతంలో చంద్రబాబునాయుడు-కేసీఆర్‌ మద్య శతృత్వం ఉన్నందున, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాధికారులు వారి వైఖరికి అనుగుణంగానే వ్యవహరించవలసి వచ్చింది కనుక 5 ఏళ్ళు గడిచినా విభజన సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. కానీ ఇప్పుడు ఇద్దరు సిఎంల మద్య మంచి సఖ్యత ఉంది కనుక రెండు ప్రభుత్వాలు పట్టువిడుపులు ప్రదర్శిస్తూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సమస్యలన్నిటినీ సామరస్యంగా పరిష్కరించుకునేందుకు చక్కటి అవకాశం ఏర్పడింది. 

అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏపీకి, పోలవరం ప్రాజెక్టు, ఏ‌పీకి ప్రత్యేకహోదా అంశాలపై తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. ప్రాజెక్టుల నిర్మాణాలు, ముఖ్యంగా నీటి పంపకాలు,  విభజన సమస్యలే మళ్ళీ ఇరువురు ముఖ్యమంత్రుల మద్య దూరం పెరిగేందుకు కారణం కావచ్చు కనుక అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ సమస్యలను ఒకటొకటిగా పరిష్కరించవలసి ఉంటుంది.


Related Post