టి-కాంగ్రెస్‌ పరిస్థితి ఏమిటో?

June 17, 2019


img

ఒకపక్క తెరాస మరోపక్క బిజెపి దొలిచేస్తుండటంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నానాటికీ గుల్లబారిపోయి బలహీనపడుతోంది. పార్టీలో నుంచి బయటకు వెళ్లిపోతున్న నేతల విమర్శలను తిప్పి కొట్టడమే తప్ప పార్టీని బ్రతికించుకునేందుకు ఏమి చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియాతో సహా పార్టీలో ఎవరూ ఆలోచిస్తున్నట్లు లేదు. 

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని బహుశః ఇక చక్కదిద్దలేమని గ్రహించినందునే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచినప్పటికీ మళ్ళీ లోక్‌సభకు పోటీ చేసి ఉండవచ్చు. ఆయన కోరుకున్నట్లే గెలిచారు కనుక జాతీయరాజకీయాలలోకి వెళ్లిపోవాలనుకొంటున్నట్లు చెప్పారు. అంటే కాడి దింపేయాలనుకుంటున్నట్లు చెప్పవచ్చు. అయినా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీయే కాడి దింపేసుకోవాలనుకొంటున్నప్పుడు ఇక రాష్ట్ర స్థాయి నేతలు కాడి మోస్తారనుకోవడం అత్యసే అవుతుంది కదా?

త్వరలో కోమటిరెడ్డి సోదరులిద్దరూ కూడా పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి కూడా తెరాస ధాటిని తట్టుకోలేకపోతున్నారు కనుక ఆయన జాతీయరాజకీయాలలోకో లేదా బిజెపిలోకో షిఫ్ట్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక పార్టీలో మిగిలిన జైపాల్ రెడ్డి వంటి సీనియర్లు ఎప్పుడో అస్త్రసన్యాసం చేసేశారు. ఉన్నవారిలో జానారెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ వంటివారు పార్టీని భుజానికెత్తుకొని మోయగలస్థితిలో లేరు. విజయశాంతి వంటివారు తమ ఉనికిని చాటుకునేందుకు అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నారు తప్ప వారు కూడా ఏమీ చేయగల స్థితిలో లేరు. . కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగానే కనిపిస్తోంది. కనుక రానున్న రోజులలో కాంగ్రెస్‌ నుంచి వలసలు మరింత జోరందుకోవచ్చు.


Related Post