తెలంగాణలో బిజెపి ఎలా పుంజుకోగలిగింది?

June 17, 2019


img

ఒకప్పుడు తెలంగాణలో బిజెపి చాలా బలంగా ఉన్న మాట వాస్తవం. కానీ గత ఐదేళ్ళలో బిజెపి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అందరూ చూశారు. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయంతో రాష్ట్రంలో బిజెపి పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ లోక్‌సభ ఎన్నికలలో అనూహ్యంగా నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడమే కాకుండా ఇప్పుడు తెరాసకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఐదేళ్లుగా చతికిలపడిన బిజెపి కేవలం 3-4 నెలల వ్యవధిలో ఏవిధంగా పుంజుకొంది? రాష్ట్రంలో బిజెపి నిజంగా బలపడిందా లేక బలపడినట్లు కనిపిస్తోందా?అని సందేహాలు కలుగకమానవు. 

ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం చేతనే బిజెపి బలపడినట్లు కనిపిస్తోంది తప్ప హటాత్తుగా రాష్ట్రంలో బిజెపి బలం పెరిగే అవకాశం లేదని అందరికీ తెలుసు. బిజెపి గెలుచుకున్నవాటిలో ఒక్క సికిందరాబాద్‌ నియోజకవర్గంలో తప్ప మిగిలిన మూడు స్థానాలలో కాంగ్రెస్‌, తెరాస తప్పిదాల వలన బిజెపి గెలువగలిగిందని చెప్పవచ్చు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో బిజెపి తెరాస, కాంగ్రెస్‌ల కంటే చాలా వెనుకబడిపోవడం గమనిస్తే నేటికీ రాష్ట్రంలో బిజెపి బలపడలేదని స్పష్టం అవుతోంది. 

కారణాలు ఏవైనప్పటికీ బిజెపి 4 సీట్లు గెలుచుకొంది. కేంద్రంలో బిజెపి మళ్ళీ అధికారంలోకి వచ్చింది కనుక రాష్ట్ర బిజెపి నేతలలో కొత్త ఉత్సాహం పొంగుతోంది. ఇదే సమయంలో...రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంధకారంగా కనిపిస్తుండటంతో తెరాసలో చేరలేని కాంగ్రెస్‌ నేతలు బిజెపిని ఆశ్రయిస్తున్నారు. అంటే రాష్ట్ర బిజెపి స్వయంకృషి కంటే కాంగ్రెస్ పార్టీని తెరాస రాజకీయంగా బలహీనపరిచినందున బిజెపి బలపడినట్లు కనిపిస్తోందని స్పష్టం అవుతోంది. 

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో బిజెపి పుంజుకొన్న సమయంలోనే తెలంగాణలో కూడా బిజెపి పుంజుకోవడంతో...గట్టిగా ప్రయత్నిస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలోకి రాగలమనే నమ్మకం, ఆత్మవిశ్వాసం బిజెపి అధిష్టానానికి కలిగి ఉండవచ్చు. కనుక ఇకపై సిఎం కేసీఆర్‌తో స్నేహం తగ్గించుకొని, రాష్ట్రంలో బిజెపి ఎదిగేందుకు తోడ్పడాలని బిజెపి అధిష్టానం నిర్ణయించి ఉండవచ్చు. బహుశః అందుకే అసెంబ్లీ ఎన్నికల తరువాత నోరువిప్పలేకపోయిన బిజెపి నేతలు ఇప్పుడు రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నామని గట్టిగా చెప్పగలుగుతున్నారు. కానీ బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు తెరాస ప్రయత్నించకుండా ఉంటుందనుకోవడం రాజకీయ అజ్ఞానమే అవుతుంది. తెరాస విసరబోయే సవాళ్ళను బిజెపి తట్టుకొని నిలబడి ఎన్నికలలో దానికి తిరిగి సవాలు విసరగలిగే స్థాయికి చేరినప్పుడే రాష్ట్రంలో బిజెపి బలపడిందని భావించవచ్చు.


Related Post