అందుకే కేసీఆర్‌ మోడీని కలువలేదు: లక్ష్మణ్

June 17, 2019


img

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ సిఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో రాష్ట్రాలు పర్యటించి వచ్చిన సిఎం కేసీఆర్‌కు రాష్ట్రాల సమస్యలు, అభివృద్ధికి సంబందించి చర్చించేందుకు ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడానికి సమయం లేదా? ఏపీ సిఎం జగన్‌ ఆ సమావేశంలో పాల్గొని ఏ‌పీకి ప్రత్యేకహోదా గురించి గట్టిగా మాట్లాడారు కానీ సిఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా సాధించాలనే చిత్తశుద్ధి లేనందున ఆ సమావేశానికి హాజరుకాలేదు. కేసీఆర్‌ అంచనాలకు భిన్నంగా కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడీ అధికారంలోకి రావడంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన అటకెక్కించవలసిరావడం, ఆయన కుమార్తె కవిత ఓటమి, రాష్ట్రంలో బిజెపి నాలుగు సీట్లు గెలుచుకోవడంతో ప్రధాని మోడీకి మొహం చూపించలేకనే సిఎం కేసీఆర్‌ నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రప్రభుత్వం చాలా ఉదారంగా నిధులు, అనుమతులు మంజూరు చేసింది. కానీ దాని ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని కేసీఆర్‌ ఆహ్వానించకపోవడం శోచనీయం. కేసీఆర్‌కు నిధులు, అనుమతులు కావలసి వచ్చినప్పుడే ప్రధాని మోడీ గుర్తొస్తారు,” అని విమర్శించారు. 

నూతన సచివాలయ నిర్మాణ ప్రతిపాదన గురించి మాట్లాడుతూ, “సచివాలయం వాస్తు బాగోకపోతే సరిచేయించుకోవాలి కానీ 100 సం.లైనా చెక్కుచెదరకుండా నిలువగలిగే భవనాలను వాస్తు కోసం 20,30 సం.లకే ఎవరైనా కూల్చుకుంటారా? కొత్త సచివాలయ నిర్మాణానికి వినియోగించాలనుకుంటున్న ఆ డబ్బును రాష్ట్రంలో రైతులకు, విద్యార్దులకు వినియోగిస్తే మంచిది,” అని అన్నారు. 

కాంగ్రెస్‌ నేతల చేరికలపై స్పందిస్తూ, “బిజెపిలో చేరుతామని కాంగ్రెస్‌, టిడిపి నేతల నుంచి నాకు రోజూ చాలా ఫోన్లు వస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సహా ఎవరు వచ్చినా సాధరంగా పార్టీలోకి ఆహ్వానిస్తాము. త్వరలోనే బిజెపిలోకి బారీ చేరికలుంటాయి. తెరాసకు బిజెపి ప్రత్యామ్నాయమని ఇప్పుడు రాష్ట్రంలో అందరూ గుర్తించారు. పార్టీలో చేరబోతున్న ఎమ్మెల్యేల పదవులకు రాజీనామాల విషయంపై మా అధిష్టానం తుది నిర్ణయం తీసుకొంటుంది,” అని అన్నారు.


Related Post