కాంగ్రెస్‌ పార్టీకి కోమటిరెడ్డి సోదరులు గుడ్ బై?

June 15, 2019


img

అనుకున్నంత అయ్యింది. ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు త్వరలో బిజెపిలో చేరబోతున్నారని రెండు రోజుల క్రితం మీడియాలో వచ్చిన ఊహాగానాలు నిజమని నిరూపిస్తూ, మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియాలపై ఈరోజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందని, ఇక తెరాసను ఎదుర్కోగల శక్తి బిజెపికి మాత్రమే ఉందని అన్నారు. బిజెపిలో చేరే విషయమై పార్టీ కార్యకర్తలతో చర్చించి త్వరలోనే నిర్ణయం చెపుతానని అన్నారు. 

ఆయన మాటలలోనే... “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి కలగడానికి రాంచంద్ర కుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డిలే. వీరిద్దరి తప్పుడు నిర్ణయాల కారణంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓటమి తరువాత 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లిపోకుండా వారిద్దరూ కాపాడుకోలేకపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలను తెరాస చాలా వేధిస్తోంది. వారు అష్టకష్టాలు పడుతూ కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకోవడానికి పనిచేస్తుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా ఇంకా పార్టీలో అనామక నేతలు గోల్కొండ హోటల్లో కూర్చొని తప్పుడు నిర్ణయాలు తీసుకొని పార్టీని నిలువునా ముంచేశారు. 

అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేము వారిని పదేపదే హెచ్చరించాము. కానీ కార్పొరేటర్ గా కూడా గెలవలేనివారికి పదవులు, టికెట్లు పంచిపెట్టారు. పార్టీ ఓడిపోయిన తరువాత అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా నైతిక బాధ్యత వహించి తమ పదవులకు రాజీనామాలు చేసి ఉంటే బాగుండేది. కానీ నేటికీ ఇద్దరూ ఆ పదవులు పట్టుకొని వ్రేలాడుతున్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎవరూ కాపాడలేరు. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధ కలుగుతోంది కానీ ఇది వాస్తవమని అందరికీ తెలుసు. చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు మాకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వజూపినా ఏమి ప్రయోజనం? 

తెలంగాణ ఏర్పడితే ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో చక్కటి ప్రజాస్వామ్య పాలన ఏర్పడుతుందని ప్రజలు భావిస్తే రాష్ట్రంలో అప్రజాస్వామిక, నిరంకుశ, కుటుంబపాలన సాగుతోంది. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను సిఎం కేసీఆర్‌ అణచివేస్తూ, ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ తనకు ఎదురేలేకుండా చేసుకున్నారు. ఈ పరిస్థితులలో కేసీఆర్‌ను ఎదుర్కోగల శక్తి బిజెపికి మాత్రమే ఉంది. రాష్ట్రంలో కేసీఆర్‌ నియంతృత్వ పాలన అంతమొందించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచే అవకాశాలు బిజెపికి మాత్రమే ఉన్నాయి. కేంద్రంలో దమ్మున్న ప్రధాని నరేంద్రమోడీ ఉన్నారు. యావత్ దేశం ఆయన వైపే చూస్తోందిప్పుడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అంధకారంగా మారింది. కనుక ప్రజల పక్షాన్న నిలబడి కేసీఆర్‌తో పోరాడాలంటే బిజెపిలో చేరక తప్పదు. బిజెపిలో చేరికపై త్వరలోనే నా నిర్ణయం తెలియజేస్తాను,” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 

ఆయన బిజెపిలో చేరితే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారనుకోవడం అవివేకం, అత్యాసే అవుతుంది. కనుక కోమటిరెడ్డి సోదరులు త్వరలోనే కాషాయ కండువాలు కప్పుకోవడం ఖరారైపోయినట్లే. 

ఇక బిజెపిలో చేరబోయే మరొక ఎంపీ ఎవరై ఉంటారని పెద్దగా ఆలోచించనవసరం లేదు. పార్టీలో రేవంత్‌ రెడ్డి కూడా కేసీఆర్‌ను ఇదే స్థాయిలో ద్వేషిస్తున్నారు. కనుక ఆయన కూడా బిజెపిలో చేరబోతున్నట్లు వార్తా నేడో రేపో వినబడటం ఖాయం. 


Related Post