లాఠీఛార్జ్ తెచ్చిన లాభం

July 27, 2016


img

అందరూ బాగుండాలి.. అందరికి ఆరోగ్యాలు బాగుండాలని, మన వాళ్ళకోసం మనం కోరుకుంటే, డాక్టర్లు మాత్రం ఊర్లో వాళ్లందరికి రోగాలు రావాలి.. వాళ్లంతా తమ తమ హాస్పిటల్ కే రావాలని కోరుకుంటారు. ఇక్కడ ఇద్దరి కోరికల్లోనూ న్యాయం ఉంది. ఎందుకంటే తమ వాళ్ల కోసం ప్రార్థించడంలో తప్పులేదు... బిజినెస్ కోసం డాక్టర్ కోరుకోవడంలోనూ తప్పులేదు. అలాగే మొన్న మల్లన్న సాగర్ ప్రాజెక్టు వద్ద జరిగిన లాఠీ చార్జ్ పై వ్యతిరేకత పెల్లుబుకుతుంటే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి.

కాలం కలిసొస్తే నడిచొచ్చే కొడుకు వస్తాడు అంటే ఇదే మరి. గత రెండు సంవత్సరాలుగా ఏమాత్రం పనిలేని ప్రతిపక్షాలకు మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసుల లాఠీ చార్జ్ పని కల్పించింది. రాజకీయ నిరుద్యోగులకు ప్రభుత్వం మీద విమర్శలు చేసే ఫ్రీ ఉద్యోగం దొరికింది. అందుకే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. మెదక్ జిల్లాలోనే కాకుండా, హైదరాబాద్ లో కూడా తెగ హడావిడి చేశారు. జానారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా తేల్చుకుందాం అన్నట్లు కదనరంగంలోకి దిగారు. 

కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిక్షణం ప్రతిపక్ష పార్టీలకు కునుకులేకుండా చేశారు. నిత్యం ఎవరినో ఒకరిని తన పార్టీలోకి చేర్చుకుంటూ.. తన సైన్యాన్ని పెంచుకున్నారు. తన బలాన్ని పెంచుకుంటూ.. ప్రతిపక్షాల బలహీనతలను వాడుకున్నారు. అయితే పద్నాగేళ్లకు పెంటకుప్పకు కూడా కాలం కలిసివస్తుంది అని ఓ సామెత ఉంది. మరి అలాంటిది ప్రతిపక్షాలకు మాత్రం అవకాశాలు రావా.. ప్రభుత్వం తప్పులు చెయ్యదా..? అదే మల్లన్నసాగర్ ప్రాజెక్టు.

మల్లన్న సాగర్ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జ్ తో ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారిగా బలం పుంజుకున్నాయి. విడిపోయిన తేనెటీగల గుంపు ఒక్కసారిగా గుమిగూడాయి. అన్నీ కలిసి కేసీఆర్ సర్కార్ కు మంటపుట్టించే ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న మీడియా ఛానల్స్, పేపర్ల ద్వారా మల్లన్న సాగర్ మంచిదే అనే ప్రచారం చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మొత్తంగా కేసీఆర్ కు వ్యతిరేకంగా వచ్చిన ప్రజా ఉద్యమానికి వంతపలుకుతూ ప్రతిపక్షాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. 

బలవంతుడిని కొట్టాలంటే బలం ఒక్కటే సరిపోదు.. అందుకే ప్రతిపక్ష పార్టీలు అన్నీ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఉన్నదే అంతంత బలం మరి ఉన్న వాటిలో పార్టీల పేరుతో విడిపోతే అది కూడా ఉండదు. అందుకుగాను తెలంగాణ రాజకీయ జేఏసీతో కలిసి టిడిపి, బిజెపి, కాంగ్రెస్, వైసీపీ, సిపిఐ, సిపిఎంలు పోరాటం చెయ్యాలి. అప్పుడే అంతో ఇంతో ప్రతిపక్షాలు కాస్త బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి అన్న భావన ప్రజల్లోకి వెళితే, అది సదరు పార్టీలకు భవిష్యత్ లో లాభం చేకూరుస్తుంది అన్నదాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. మరి ప్రతిపక్షాలు దీన్ని ఎంత వరకు తమకు అనుకూలంగా మార్చుకుంటారు అనేది వాళ్ల వాళ్ల శక్తి మీద ఆధారపడి ఉంటుంది.


Related Post