ఆ ప్రభావం తెలంగాణ ప్రభుత్వంపై ఉంటుందా?

June 12, 2019


img

ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చి ఇంకా పూర్తిగా రెండువారాలు పూర్తికాక మునుపే, జగన్ తీసుకొంటున్న సంచలన నిర్ణయాల ప్రభావం తెలంగాణ ప్రభుత్వంపై ఉంటుందా లేదా? అనే చర్చ అప్పుడే మొదలైపోయింది. గతంలో సిఎం కేసీఆర్‌ ప్రభుత్వోద్యోగులకు, ఆశావర్కర్లు, హోంగార్డులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తదితరులకు భారీగా జీతాలు పెంచినప్పుడు, ఏపీ ప్రభుత్వంపై ఆ ఒత్తిడి పడింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి జగన్ ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలతో తెరాస ప్రభుత్వంపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. 

ఆర్దికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్రభుత్వమే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు, ఉద్యోగులకు, కాంట్రాక్ట్ కార్మికులకు వరాలు కురిపిస్తున్నప్పుడు, దేశంలో రెండవ ధనిక రాష్ట్రంగా నిలిచి, ఆర్ధికంగా ఎంతో బలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం కూడా ఇవ్వగలదు కదా...కానీ ఎందుకు ఇవ్వడం లేదు? అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ కేటాయింపులు, ఉద్యోగుల జీతాల పెంపు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్లు త్వరలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. 

అయితే ఏపీ ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసి కూడా జగన్‌ సిఎం పదవి చేపట్టిన వారంపది రోజులలోనే తన ప్రభుత్వంపై మరింత ఆర్ధికభారం పడే ఇన్ని కీలకనిర్ణయాలు ఎందుకు తీసుకొంటున్నారు? వాటికి ఆయన ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకొంటారు? అసలు జగన్ ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు? అనే చర్చ కూడా మొదలయింది. 

ఆర్ధికంగా బలహీనంగా ఉన్న ఏపీ ప్రభుత్వంపై ఇంకా ఆర్ధికభారాన్ని పెంచే నిర్ణయాలు జగన్ ఎందుకు తీసుకొంటున్నారని ఆలోచిస్తే, నేటికీ రాష్ట్ర ప్రజలలో కొందరికి తన పట్ల ఏహ్యత, అనుమానాలు, భయాలు, అపోహలు నెలకొని ఉన్నాయని గుర్తించిన జగన్ వాటిని తొలగించి అందరినీ ఆకట్టుకొనేందుకే అయ్యుండవచ్చుననిపిస్తోంది. 

ఇక ఆయన ప్రకటించిన వరాలకు నిధులు ఏవిధంగా సమకూర్చుకొంటారో ఆయనే స్వయంగా సమాధానం చెప్పాలి లేదా ఏపీ రాష్ట్ర ఆర్ధికమంత్రి లేదా వైసీపీ అధికార ప్రతినిధులు చెప్పవలసి ఉంటుంది. అలాగే ఈ నిర్ణయాలన్నీ ఎంతవరకు అమలుచేయగలరో కాలమే చెపుతుంది. కానీ ఆలోగా జగన్ నిర్ణయాల ప్రభావం కేసీఆర్‌ ప్రభుత్వంపై తప్పకపడవచ్చు.


Related Post