సిఎం కేసీఆర్‌కు జీవన్ రెడ్డి హితబోధ

June 12, 2019


img

గతంలో ఏపీ ప్రజలు తెలంగాణ సిఎం కేసీఆర్‌ పాలన, రాష్ట్రాభివృద్ధితో తమ ముఖ్యమంత్రిని, పాలనను, రాష్ట్రాభివృద్ధిని  పోల్చి చూసుకొంటూ, అన్నివిధాల కేసీఆర్‌ పాలనే బాగుందనే అభిప్రాయంతో ఉండేవారు. కనుక కేసీఆర్‌ ఎప్పుడు ఆంధ్రాకు వచ్చిన జేజేలు పలుకుతుంటారు. కానీ ఇప్పుడు జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ సీన్ రివర్స్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మే 30వ తేదీన జగన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు ఆయన చాలా చురుకుగా తీసుకొంటున్న నిర్ణయాలను చూసి ఏపీ ప్రజలు ఎలాగూ సంతోషిస్తున్నారు. జగన్ తీరును నిశితంగా గమనిస్తున్న తెలంగాణ ప్రతిపక్ష నేతలు ఇప్పుడు జగన్‌తో కేసీఆర్‌ తీరును, పాలనను పోల్చి చూడటం మొదలుపెట్టారు. ఇప్పుడే అటువంటి పోలికలు చూడటం తొందరపాటే అవుతుంది కానీ కేసీఆర్‌ను వేలెత్తి చూపడానికి ఇదొక మంచి అవకాశం కల్పిస్తోంది కనుక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వారిరువురి తీరును పోల్చి చూపుతూ కేసీఆర్‌పై విమర్శలు కురిపించారు. 

మంగళవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కొత్తగా సిఎం పదవి చేపట్టిన జగన్‌ చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొంటుంటే, ఐదేళ్ళు అనుభవం ఉన్న సిఎం కేసీఆర్‌ మాత్రం నేటికీ మాటలకే పరిమితమవుతున్నారు. జగన్ తన తండ్రిబాటలో పాదయాత్ర చేసి ఏపీ ప్రజల కష్టాలు తెలుసుకొని, వారి సమస్యల పట్ల అవగాహన పెంచుకొని, వాటిని ఒకటొకటిగా పరిష్కరిస్తుంటే, సిఎం కేసీఆర్‌ గత ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. 

ఏపీలో గత ప్రభుత్వ హయాంలోనే రెండు డీఎస్సీలు నిర్వహించింది కానీ కేసీఆర్‌ ప్రభుత్వం ఐదేళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా పూర్తి చేయలేదు. రాష్ట్రంలో ఇంకా 20,000 పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి. నేటికీ టీఆర్టీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఇంకా పూర్తికానేలేదు. 

జగన్ సిఎం కాగానే ఏపీలో విద్యావ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పిల్లలను బడులకు పంపించే తల్లులకు రూ.15,000 ప్రోత్సాహకాలు ఇస్తూ రాష్ట్రంలో అందరికీ విద్యావకాశాలు పెంచుతున్నారు. కానీ కేసీఆర్‌ పాలనలో కేజీ టూ పీజీ ఉచితవిద్య, ఇంగ్లీష్ మీడియం బోధన ఇంకా ప్రారంభదశలోనే ఉంది. 

కేసీఆర్‌ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ హామీ నేటికీ పూర్తికాలేదు. కానీ జగన్ నిర్ధిష్టకాలపరిమితిలో పేదలకు ఇళ్ళ నిర్మాణాలకు మంచి ప్రణాళికను ప్రకటించారు. 

ఇక జగన్‌ ముఖ్యమంత్రి కాగానే ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారు కానీ పీ.ఆర్.సీ గడువు ముగిసి ఏడాది కావస్తున్నా సిఎం కేసీఆర్‌ మాత్రం ఇంతవరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. అలాగే ఉద్యోగుల చిరకాల డిమాండ్లు ఐఆర్‌, సీపీఎస్‌ లను జగన్ రద్దు చేశారు. కానీ కేసీఆర్‌ ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. 

జగన్ ముఖ్యమంత్రి కాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించారు. కానీ కేసీఆర్‌ మాత్రం ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా కటినంగా వ్యవహరిస్తున్నారు. ఉద్యోగ కల్పన, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, అమ్మ ఒడి, రేషన్ సరుకులు, ఇళ్ళస్థలాల పంపిణీ వంటి అనేక అభివృద్ధి, సంక్షేమ అంశాలపై ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చాలా చురుకుగా నిర్ణయాలు తీసుకొని ప్రజల ప్రశంశలు అందుకొంటున్నారు. ఐదేళ్ళు గడిచిపోయినా సిఎం కేసీఆర్‌ ఇంకా మాటలతోనే కాలక్షేపం చేస్తున్నారు. 

జగన్ మీ కంటే వయసులో...అనుభవంలో చాలా చిన్నవాడు. పైగా మీకు మిత్రుడని గొప్పగా చెప్పుకొంటుంటారు కూడా కనుక ఆయనను చూసి నేర్చుకొంటే బాగుంటుంది,” అని జీవన్ రెడ్డి అన్నారు.


Related Post