హుజూర్‌నగర్‌లో నిజామాబాద్‌ ఫార్ములా?

June 12, 2019


img

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో రైతులు చేసిన ప్రయోగాన్ని ఈసారి హుజూర్‌నగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రయత్నించడానికి అక్కడి బీసీ సంఘం నేతలు, స్థానిక మోడల్ కాలనీ పేదప్రజలు సిద్దం అవుతున్నారు. నిజామాబాద్‌లో మాదిరిగానే భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో నిలబడాలని వారు నిర్ణయించినట్లు తాజా సమాచారం. గత ఐదేళ్ళుగా తమ సమస్యల గురించి అధికారులకు, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని, కనుక నిజామాబాద్‌ రైతుల పద్దతిలోనే భారీ సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

నిజామాబాద్‌ నుంచి 176 మంది రైతులు నామినేషన్లు వేసినప్పటికీ, అక్కడి నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ కవిత, తెరాస నేతలు వారిని చాలా ‘లైట్’గా తీసుకున్నారు. వారు తమ విజయావకాశాలను ఏ మాత్రం ప్రభావితం చేయలేరని భావించారు. కానీ కవిత ఏకంగా 65,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమె ఓటమికి వేరే ఇతర కారణాలు కూడా ఉండి ఉండవచ్చు కానీ 176 మంది రైతులు ఎన్నికలలో పోటీ చేయడం కూడా ఆమె ఓటమికి ఒక కారణమని అందరికీ తెలుసు. 

కనుక హుజూర్‌నగర్‌లో కూడా కాంగ్రెస్, తెరాస, బిజెపి, టిజేఎస్‌లకు అటువంటి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందనే భావించవచ్చు. ఇంతకాలం హుజూర్‌నగర్‌కు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు కనుక ఈసారి ఈ ప్రయోగంలో కాంగ్రెస్‌ నష్టపోయి తెరాస లేదా బిజెపి లబ్ది పొందవచ్చు.


Related Post