ఉప ఎన్నికలలో కోదండరాం పోటీ

June 11, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చవిచూసిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం త్వరలో జరుగబోయే ఉప ఎన్నికలలో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. హుజూర్‌నగర్‌ శాసనసభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ నుంచి లోక్‌సభకుపోటీ చేసి ఎంపీగా ఎన్నికవడంతో ఆయన తన శాసనసభ్యత్వాన్ని వదులుకున్నారు. కనుక ప్రొఫెసర్ కోదండరాం హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. 

ఇంతకాలం రాష్ట్ర శాసనసభలో ప్రధానప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, ఫిరాయింపుల కారణంగా ఆ హోదా కోల్పోయీ బలహీనపడినందున, శాసనసభలో ప్రజల గొంతు వినిపించే వ్యక్తి అవసరమని తెలంగాణ జనసమితి భావిస్తున్నందున కోదండరాంను హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించిందని పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు  నిజ్జన రమేష్‌ముదిరాజ్‌ తెలిపారు. ఆయన తరపున ఓయు జెఏసి, ఇతర విద్యార్ధి సంఘాల ప్రతినిధులు ప్రచారంలో పాల్గొంటారని రమేష్ తెలిపారు. త్వరలోనే హుజూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు.  

అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా పోటీ నుంచి విరమించుకొంటుందా లేక రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తాయా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మంచిపట్టున్న హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ అభ్యర్ధిని ఓడించి తన సత్తా చాటుకోవాలని తెరాస భావిస్తుంటే, రాష్ట్రంలో 4 ఎంపీ సీట్లు గెలుచుకొని సమరోత్సాహంతో ఉన్న బిజెపి కూడా ఈ సీటును గెలుచుకొని తన సత్తా చాటుకోవాలని భావిస్తోంది. కనుక హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలలో కూడా పోటీ తీవ్రంగానే ఉండవచ్చు.


Related Post