సిఎం కేసీఆర్‌తో మోడీ దోస్తీ కొనసాగుతుందా లేదా?

June 11, 2019


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ నీతి ఆయోగ్ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 14న డిల్లీ వెళ్లబోతున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాలేకపోయినందున, ఈసారి డిల్లీ వెళ్లినప్పుడు ఆయనతో భేటీ అయ్యే అవకాశం ఉంది. 

నరేంద్రమోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సిఎం కేసీఆర్‌ ఆయనను తొలిసారిగా కలుస్తున్నారు కనుక వారి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే, కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడీ అధికారంలోకి రాకపోవచ్చునని, అప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్‌ భావించారు. కానీ మళ్ళీ నరేంద్రమోడీయే ప్రధాని అయ్యారు. లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో మళ్ళీ మోడీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడం, అదేసమయంలో రాష్ట్రంలో బిజెపి 4 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్ర బిజెపి నేతలు తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదగబోతున్నామని, తమ తదుపరి లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడమేనని పదేపదే గట్టిగా చెపుతున్నారు. 

ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోడీ-సిఎం కేసీఆర్‌తో యధాప్రకారం స్నేహసంబంధాలు కొనసాగిస్తారా? లేక తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని దారుణంగా దెబ్బ తీస్తున్న తమ స్నేహానికి ఫుల్ స్టాప్ పెడతారా? అనేది రానున్న రోజులలో స్పష్టం కావచ్చు. కానీ ఈ సమస్యలు ప్రధాని మోడీ-కేసీఆర్‌ తొలి భేటీకి అవరోదం కాకపోవచ్చు. సిఎం కేసీఆర్‌ డిల్లీ నుంచి తిరిగి వచ్చిన తరువాత జూన్ 15న మంత్రివర్గ సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. 



Related Post