మోడీ-కేసీఆర్‌ తోడ్పాటుతో జగన్ పాలన

May 25, 2019


img

ఈనెల 30న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ్ళ సాయంత్రం తెలంగాణ సిఎం కేసీఆర్‌ను కలిసి తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్మెంట్ లభించడం రేపు డిల్లీ వెళ్ళబోతున్నారు. 

ఏపీలో టిడిపి పతనానికి ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌లతో చంద్రబాబునాయుడి శత్రుత్వమే కారణమని అందరికీ తెలుసు. అలాగే వారిరువురితో సఖ్యతగా, విధేయతగా ఉండటమే జగన్ గెలుపుకు కారణమని అందరికీ తెలుసు.కనుక జగన్ ఇక ముందు కూడా ఇదేవిదంగా ఉండగలిగితే జగన్ ప్రభుత్వం ఎటువంటి ఆటుపోటులు లేకుండా సుస్థిరంగా కొనసాగుతుంది. 

రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం, రాష్ట్రాభివృద్ధి, ఎన్నికల హామీలను అమలుచేయడం జగన్ ముందున్న పనులు. ఈ రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించుకోగలిగితే, నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రాభివృద్ధి పనులు కొనసాగించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. మోడీ సూచనమేరకు ఏపీ రాజధాని అమరావతి పరిధిని కుదించి కేంద్రం కేటాయించిన నిధులతో పూర్తి చేసేందుకు జగన్‌ సిద్దపడవచ్చు. అవసరమైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల బాధ్యతను కేంద్రప్రభుత్వానికి అప్పగించవచ్చు. 

శత్రుశేషం, రుణశేషం ఉండకూడదని పెద్దలు అంటారు కనుక కేసీఆర్‌ పద్దతిలోనే టిడిపి ఎమ్మెల్యేలను ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్రంలో టిడిపిని తుడిచిపెట్టేయడానికి వైసీపీ గట్టిగా ప్రయత్నించవచ్చు. సిఎం కేసీఆర్‌ మార్గదర్శనంలోనే జగన్ పరిపాలన సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక అభివృద్ధి, సంక్షేమం, రాజకీయాలలో కేసీఆర్‌ పాలనను, విధానాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగవచ్చు. అవసరమైతే ప్రధాని నరేంద్రమోడీ, సిఎం కేసీఆర్‌ జగన్‌కు అన్నివిధాల తోడ్పడగలరు కనుక మళ్ళీ ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకోవచ్చు. 


Related Post