ఓడాను...కానీ కాంగ్రెస్‌ బలం చాటాము: కొండా

May 24, 2019


img

చేవెళ్ళ నుంచి లోక్‌సభకు పోటీ చేసి తృటిలో ఓడిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. 

“లోక్‌సభ ఎన్నికలలో నేను ఓడిపోయిన మాట వాస్తవం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సత్తాను తెరాసకు రుచి చూపించగలిగాము. సిఎం కేసీఆర్‌, ఆయన కుమారుడు కేటీఆర్‌ నేను గెలవకుండా అడ్డుకొనేందుకు చేయని ప్రయత్నాలు లేవు. పోలీసులను అధికారులను ఉపయోగించుకొని మమ్మల్ని వేధించారు.రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో వారి వేధింపులు పరాకాష్టకు చేరుకొన్నాయి. నాపై, కాంగ్రెస్‌ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించారు. మేము సమావేశాలు పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించారు. అడుగడుగునా పోలీసులు మాపై నిఘా ఉంచుతూ కార్యకర్తలను భయబ్రాంతులను చేశారు. సిఎం కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తెరాస నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌ తరపున పోటీ చేయడానికి సిద్దపడినప్పటి నుంచి నాపై ఈ కక్ష సాధింపులు పెరిగిపోయాయి. అయినప్పటికీ ఇంతటి ప్రతికూల పరిస్థితులలో నేను, నా పార్టీ కార్యకర్తలు ధైర్యంగా ఎన్నికలలో పోరాడాము. తప్పకుండా గెలుస్తామనే భావించాము కానీ దురదృష్టవశాత్తు ఓడిపోయాము. అందుకు నేను బాధపడటం లేదు. నాకు 5 లక్షల ఆరువేలకు పైగా ఓట్లు పడ్డాయంటే నియోజకవర్గంలో అంతమంది ప్రజలు నావైపు ఉన్నారని స్పష్టం అయ్యింది. అది చాలు నాకు. ఈ ఎన్నికలలో ఓడినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో తెరాసకు ఛాతీ చూపగలిగాము. ఎన్నికలలో ఓడిపోయినందున నేను ఇక డిల్లీకి వెల్లనవసరం లేదు కనుక ఇకపై పూర్తి సమయం ప్రజా సమస్యల పరిష్కారానికే కేటాయిస్తాను,” అని చెప్పారు. 

ఎమ్మెల్యేల ఫిరాయింపులతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనైపోయిందనుకొన్న వారికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పెద్ద షాక్ అనే చెప్పాలి. తృటిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఓడిపోయారు లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాలుగు సీట్లు గెలుచుకొని ఉండేది. ఎండాకాలంలో పచ్చగడ్డి పూర్తిగా ఎండిపోయి భూమిలో కలిసిపోయినట్లు కనిపించినా నాలుగు చినుకులు పడగానే మళ్ళీ పచ్చగా పరుచుకొంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా పచ్చగడ్డి వంటిదేనని మరోసారి నిరూపించుకొంది.

     Related Post