రాహుల్ తప్పుకొంటేనే మంచిదేమో?

May 24, 2019


img

కొన్ని నెలల క్రితం మూడు బిజెపి పాలిత రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి రావడంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై అనుమానాలు తొలగిపోయినట్లే కనిపించాయి. కానీ మళ్ళీ ఇప్పుడు అనుమానాలు మొదలైయ్యాయి. ఇటువంటి సమస్య ఎదురవుతుందనుకొన్నప్పుడు రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్దపడటం, వెంటనే సోనియా గాంధీయో మరొకరో వారించడం వారి మాట మన్నించి ఆయన మళ్ళీ యధాప్రకారం పదవిలో కొనసాగడం జరుగుతుంటుంది. నిన్న లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత కూడా మళ్ళీ అదే జరిగింది. రేపు జరుగబోయే కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ డ్రామాను మరికొంత రక్తి కట్టించి ముగించే అవకాశాలే ఎక్కువున్నాయి.

సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం కోరుకొంటునట్లయితే, పార్టీని సమర్ధుడైన వ్యక్తి చేతిలో పెడితేనే మంచిది. దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కాంగ్రెస్ పార్టీలో అనేకమంది హేమాహేమీలున్నారు. వారిలో ఎవరో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించడానికి సోనియా, రాహుల్ గాంధీలు సిద్దపడితే తప్పకుండా అనేకమంది ముందుకు వస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ తమ కుటుంబం చేతిలోనే ఉండాలనుకొంటే మళ్ళీ లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో కాంగ్రెస్ పార్టీ కనబడకుండా మాయం అయిపోయినా ఆశ్చర్యం లేదు. చేజేతులా పార్టీని నష్టపరుచుకొనేబదులు ఎవరో ఒక సమర్ధుడి చేతిలో పెడితే పార్టీ బలపడితే వారికి కూడా మంచిదే కదా?

లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన తన సోదరి ప్రియాంకా వాద్రాను ప్రత్యక్ష రాజకీయాలలోకి తెచ్చినప్పుడే ఆయన నాయకత్వ లక్షణాలపై చర్చ మొదలైంది. ఎన్నికలలో పార్టీని గెలిపించలేరనే భయంతోనే ఆమెను ముందుకు తీసుకువచ్చారనే వాదనలు వినబడ్డాయి. అయినా కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడం కోసం రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేయడానికి సిద్దపడినప్పుడు, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి అధ్యక్ష పదవిని త్యాగం చేయలేరా? ఆలోచిస్తే బాగుంటుంది.


Related Post