ఉత్తమ్ గెలుపు..కాంగ్రెస్‌ ఓటమి?

May 23, 2019


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో హుజూర్‌నగర్‌ నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ, పార్టీ నిర్ణయం మేరకు నల్గొండ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయన ఆధిక్యతలో ఉన్నారు. ఒకవేళ చివరివరకు ఇదేవిదంగా ఆధిక్యత కొనసాగితే ఆయన గెలుస్తారు. కానీ కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీయే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనబడటం లేదు కనుక ఆయన గెలుపు వలన పార్టీకి ఎటువంటి ప్రయోజనం ఉండబోదు. ఒకవేళ ఎంపీగా ఎన్నికైతే ఆయన తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయవలసి ఉంటుంది కనుక ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుచుకోలేకపోతే పార్టీకి మరింత నష్టం కలుగుతుంది. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచినప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందన్న మాట. 

కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఓటమి ప్రభావం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీపై తప్పకుండా పడుతుంది. కేంద్రంలో పూర్తి మెజార్టీతో మళ్ళీ బిజెపి అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టం అయ్యింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి 4-5 స్థానాలలో ఆధిక్యతలో ఉంది కనుక ఆ స్థానాలను గెలుచుకొనే సూచనలు కనిపిస్తున్నాయి. కనుక రాష్ట్రంలో బలపడి తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలు చేయవచ్చు. ఆ ప్రయత్నంలో కాంగ్రెస్‌ నేతలను బిజెపిలోకి ఆకర్షించే ప్రయత్నాలు చేయవచ్చు. 

బిజెపి విసరబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి పార్టీని మరింత బలపరుచుకొనే ప్రయత్నంలో తెరాస కూడా కాంగ్రెస్‌ నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించవచ్చు. కనుక ఒకవైపు బిజెపి మరోవైపు తెరాసలు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పంచేసుకొంటే ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టమే.


Related Post