కారు జోరు కాస్త తగ్గిందా?

May 23, 2019


img

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి గులాబీ కారు (తెరాస) దూసుకుపోతోంది. కానీ సిఎం కేసీఆర్‌ చెప్పినట్లుగా 16 సీట్లు వచ్చే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం తెరాస 9 స్థానాలలో ఆధిక్యతలో ఉండగా, నిజామాబాద్‌లో తెరాస అభ్యర్ధి కవిత వెనుకబడి ఉండటం చాలా ఆశ్చర్యకరం. ఆమెపై బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. 

మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డిపై పోటీ చేసిన తెరాస అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. భువనగిరి నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెనుకబడ్డారు. ఆయన సమీప ప్రత్యర్ది బూర నర్సయ్య గౌడ్ ఆధిక్యతలో ఉన్నారు.  

తెరాస అభ్యర్ధులు కొత్త ప్రభాకర్‌రెడ్డి (మెదక్‌), తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ (సికింద్రాబాద్‌), పసునూరి దయాకర్‌ (వరంగల్‌), బూర నర్సయ్యగౌడ్‌(భువనగిరి), నామా నాగేశ్వరరావు (ఖమ్మం), గోడం నగేశ్‌(ఆదిలాబాద్‌) నేతకాని వెంకటేశ్‌ (పెద్దపల్లి), బీబీ పాటిల్‌ (జహీరాబాద్‌) ముందంజలో ఉన్నారు. 

ఇక చేవెళ్ళ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్ది కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి అభ్యర్దులు ధర్మపురి అరవింద్ (నిజామాబాద్‌), బండి సంజయ్ (కరీంనగర్‌), సోయమ్ బాపూరావు (ఆదిలాబాద్) అసదుద్దీన్ ఓవైసీ (హైదరాబాద్‌) ముందంజలో ఉన్నారు.


Related Post