దేశప్రజలందరూ నమో నమః

May 23, 2019


img

ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పినట్లుగానే బిజెపి సొంతంగా 275 సీట్లు, ఎన్డీయే మిత్రపక్షాలతో కలిసి 321 పైగా సీట్లు గెలుచుకొని తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విదంగా ఈసారి నరేంద్రమోడీకి దేశవ్యాప్తంగా వ్యతిరేకత పెరిగినప్పటికీ దేశప్రజలు నమో నమః అంటూ మళ్ళీ ఆయనకే ఓట్లు వేయడం విశేషమే. 

తెలంగాణలో తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలిచి పోరాడిన కాంగ్రెస్‌ కేవలం ఒకే స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతుండగా, మొదటి నుంచి పోటీలో వెనుకబడిపోయిన బిజెపి ఈసారి 5 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతుండటం విశేషం.

ఇక యూపీలో ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రియాంకా వాద్రాను రంగంలో దింపినప్పటికీ బిజెపి 51 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఎస్పీ 16, బీఎస్పీ7, కాంగ్రెస్‌ కేవలం ఒక్క స్థానంలో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. ప్రధానమంత్రి కావాలని కలలుకన్న బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఈ ఫలితాలు ఊహించని షాకే. 

ఇక ఈసారి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పాగా వేయాలనే పట్టుదలతో మోడీ, అమిత్ షాలు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి. పశ్చిమబెంగాల్లో బిజెపికి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని మమతా బెనర్జీ చెప్పగా, బిజెపి 15 స్థానాలలో ఆధిక్యతలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్: 23 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నప్పటికీ దాని సీట్లకు ఈసారి బిజెపి గండి కొట్టబోతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాలలో ఆధిక్యతలో ఉంది.  

మహారాష్ట్రలో బిజెపి: 23, దాని మిత్రపక్షం శివసేన 20 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. ఒడిశాలో బిజెపి 6, అధికార బిజెడి:10 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి.    

హర్యానాలో బిజెపి: 8, కాంగ్రెస్‌: 1, ఝార్ఖండ్ రాష్ట్రంలో బిజెపి: 12, కాంగ్రెస్‌: 2 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి.


Related Post