ఎగ్జిట్‌ పోల్స్‌: తెరాసకు సంతోషమా... బాధా?

May 22, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు రెంటికీ మెజార్టీ రాదని, అప్పుడు ఫెడరల్‌ ఫ్రంట్‌ కేంద్రప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తుందని కేసీఆర్‌తో సహ తెరాస నేతలు గట్టిగా వాదించారు. కానీ ఎగ్జిట్‌ పోల్స్‌లో ఊహించినట్లుగానే తెలంగాణలో తెరాస అత్యదిక ఎంపీ స్థానాలు గెలుచుకోబోతోందని తేలింది కానీ కేంద్రంలో మళ్ళీ బిజెపి రాబోతోందనే వాటి జోస్యం కేసీఆర్‌ అంచనాలకు భిన్నంగా ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. 

ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడేవరకు కేంద్రంలో హంగ్ ఏర్పడబోతోందనే భావనే సర్వత్రా కనిపించింది. హంగ్ ఏర్పడితే కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడటంతో ఒక్కసారిగా ఆ అంచనాలు, ఆ ఊహాగానాలు, అందరి ఆశలు అన్నీ తారుమారయిపోయాయి.    

ఒకవేళ ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పినట్లుగానే మళ్ళీ పూర్తిమెజార్టీతో నరేంద్రమోడీ అధికారం చేపడితే, తెరాస చేతిలో 12-16 ఎంపీ సీట్లు ఉన్నప్పటికీ అది కొత్తగా చేయగలిగిందేమీ ఉండదు. రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులకు అనుమతుల కోసం వారిచేత కేంద్రంపై ఒత్తిడి చేయగలదు అంతే. 

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ‘తెరాస భరతం పడతామని, రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని’ రాష్ట్ర బిజెపి కె. లక్ష్మణ్ ముందే హెచ్చరించారు. మోదీతో కేసీఆర్‌ ఎంత విధేయంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో బిజెపిని ఎదగకుండా అడ్డుకొంటారంటే మోడీ, అమిత్ షాలు ఎల్లకాలం అలాగే చూస్తూ ఊరుకోలేరు. ఒకవేళ కేంద్రంలో బిజెపి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తే దాని తదుపరి లక్ష్యం రెండు తెలుగు రాష్ట్రాలే కనుక కేసీఆర్‌ తన ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనను అటకెక్కించి బిజెపి విసరబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్దపడాల్సి ఉంటుంది. లేదా ఒకవేళ మోడీ అంగీకరిస్తే ఎన్డీయేలో చేరి కేంద్రం నుంచి ఇబ్బందులు కలగకుండా తప్పించుకోవచ్చు.


Related Post