బిజెపికి 300 సరే...కానీ టి-బిజెపికి ఎన్ని?

May 21, 2019


img

ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టి తాము ఊహించినట్లే బిజెపికి 300కు పైగా సీట్లు గెలుచుకొని కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. ఇదంతా ప్రధాని నరేంద్రమోడీ పనితీరు కారణంగానే సాధ్యమైందని అన్నారు. దేశభద్రత విషయంలో కాంగ్రెస్‌, తెరాస నేతలు ఎన్ని అవాకులు చావాకులు వాగినప్పటికీ దేశప్రజలు మోడీ చేసింది సరైనదేనని భావించి మళ్ళీ అధికారపగ్గాలు అప్పజెప్పబోతున్నారని అన్నారు. కేసీఆర్‌ ఎటువంటి అజెండా లేకుండా కేవలం మోడీని గద్దె దించడమే లక్ష్యంగా కూటమి కట్టాలనుకొన్నప్పటికీ ప్రజలు ఆయన మాయమాటలు నమ్మలేదన్నారు. 

కేంద్రంలో బిజెపికి 300 సీట్లు వస్తాయని చెప్పిన సర్వేలే తెలంగాణలో బిజెపికి ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పాయి. కానీ లక్ష్మణ్ వాటి గురించి ప్రస్తావించలేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయిన బిజెపి లోక్‌సభ ఎన్నికలలోనైనా గౌరవప్రదమైన సీట్లు సాధిస్తే ఆ క్రెడిట్ లక్ష్మణ్ కె దక్కేది. కానీ ఈ ఎన్నికలలో కూడా ఓటమి తప్పకపోతే బాధ్యత ఆయనదే అవుతుంది కదా? నిత్యం మోడీ నామస్మరణ, కేసీఆర్‌పై విమర్శలతో కాలక్షేపం చేసే బదులు ఒకప్పుడు తెలంగాణలో చాలా బలంగా ఉన్న బిజెపి ఒక్కో ఎన్నికల తరువాత ఎందుకు ఇంతగా దిగజారిపోతోంది? మళ్ళీ లేచి నిలబడటానికి ఏమి చేయాలి? అని ఆలోచిస్తే బాగుంటుందేమో? 


Related Post