బాబుకు ఇంకా రెండు రోజులే మిగిలుంది: వైసీపీ

May 21, 2019


img

ఏపీలో వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రాబోతోందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ చెప్పిన జోస్యంతో టిడిపి నేతలలో కలవరం మొదలవగా వైసీపీ నేతలు అప్పుడే అధికారంలోకి వచ్చినట్లు ఆనందంతో పొంగిపోతున్నారు. 

ఏపీ సిఎం చంద్రబాబునాయుడుకు మరొక రెండు రోజులు మాత్రమే సమయం మిగిలుందని, ఆ తరువాత జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ సిఎం కాబోతున్నారని కర్నూలు వైసీపీ నేత బీవై రామయ్య అన్నారు. టిడిపికి 110 సీట్లు వస్తాయని చెప్పుకొంటున్న బాబు, ఈవీఎంలు సరికావంటూ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే బాబు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మే 24 తరువాత టిడిపి కార్యాలయానికి టులెట్ బోర్డు తగిలించాల్సిందేనన్నారు. లగడపాటి టిడిపికి బ్రోకరులా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ 130 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రాబోతోందని అన్నారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌పై ఏపీ సిఎం చంద్రబాబు స్పందిస్తూ, “ఏపీ ప్రజల నాడీ పట్టుకోవడంలో సర్వే సంస్థలు విఫలమయ్యాయి. నేను అనేకసార్లు సర్వే చేయించాను. టిడిపి కనీసం 110 సీట్లు గెలుచుకోబోతోందని తేలింది. ఇది నూటికి 1,000 శాతం నిజం కాబోతోందని మే 23న అందరూ తెలుసుకొంటారు. టిడిపికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఎన్ని కుట్రలు చేసినా టిడిపిని ఓడించలేరని రుజువు కాబోతోంది. నేను ఒక్క పిలుపు ఇస్తే ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి తెల్లవారుజాము వరకు లైన్లో నిలబడి ఓట్లు వేశారు. వారందరూ టిడిపిపై అభిమానంతోనే తరలివచ్చి ఓట్లేశారు. కనుక టిడిపి గెలుపు ఖాయం. జగన్ కలలు కలలుగానే మిగిపోతాయి,” అని అన్నారు. 

టిడిపి, వైసీపీ నేతలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ, ఎగ్జిట్‌ పోల్స్‌ చూసిన తరువాత లోలోన చాలా ఆందోళనగా ఉన్నారని దానిని దాచుకొనేందుకే వారు ఈవిధంగా మాట్లాడుతున్నారని చెప్పవచ్చు.


Related Post