మిగిలిన తలుపులు మోడీయే మూసేసుకొన్నారు: రాహుల్

May 18, 2019


img

గత ఎన్నికలలోలాగే ఈసారి కూడా మోడీ పేరునే బిజెపి ప్రజలను ఓట్లు అడుగుతోంది. కానీ మోడీ కారణంగానే ఈసారి బిజెపి ఎదురీదవలసివస్తోంది. మొదట్లో నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తడబడినా, ఇప్పుడు రోజూ మోడీని ఎండగడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరీ చెలరేగిపోతున్నారు. రాహుల్ గాంధీ మోడీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 

“మేము నరేంద్రమోడీకి 90 శాతం తలుపులు మూసివేశాము. మిగిలిన 10 శాతం ఆయనే స్వయంగా మూసుకొన్నారు,” అని అన్నారు. 

ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలు కాంగ్రెస్‌ పార్టీని అవినీతికి మారుపేరని విమర్శిస్తున్నప్పుడు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్‌ నేతలు వారికి ఎదురుసమాధానం చెప్పలేకపోయేవారు. కానీ నోట్లరద్దు, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలులో జరిగిన అవినీతి అక్రమాలు రాహుల్ గాంధీ చేతికి బలమైన ఆయుధాలుగా లభిచడంతో కాంగ్రెస్‌ నేతలు చెలరేగిపోయారు.  రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి ఈ రెండు అంశాల గురించి పదేపదే నొక్కి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్రమోడీతో సహా బిజెపి నేతలు ఎవరూ ఆయనకు ధీటుగా బదులివ్వలేకపోయారు. దాంతో రాహుల్ గాంధీ చెపుతున్నవి నిజమేననే భావన ప్రజలకు కలిగితే ఆశ్చర్యం కాదు. 

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో దేశాభివృద్ధిని ప్రధానాంశంగా మార్చగలిగి ఉండి ఉంటే, కాంగ్రెస్ పార్టీ బిజెపిని నరేంద్రమోడీని ఇంత దీటుగా ఎదుర్కోగలిగి ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు. కానీ మోడీ పుల్వామాదాడి- తదనంతర పరిణామాల గురించి పదేపదే మాట్లాడుతూ ప్రజలలో సెంటిమెంటు రాజేసే ప్రయత్నం చేసి తప్పటడుగు వేశారని చెప్పక తప్పదు. కనుక కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోడీకి 90 శాతం తలుపులు మూసివేయగా, రాహుల్ గాంధీ చెప్పినట్లు మిగిలిన 10 శాతం తలుపులను నరేంద్రమోడీయే స్వయంగా మూసుకొన్నారని చెప్పకతప్పదు. 


Related Post