బిజెపిలో ధీమా...కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం!

May 18, 2019


img

రేపు (ఆదివారం) లోక్‌సభ చివరిదశ ఎన్నికలు జరుగబోతున్నాయి. నాలుగు రోజుల తరువాత మే 23న ఫలితాలు వెల్లడి అవుతాయి. ఈసారి కాంగ్రెస్‌, బిజెపి రెండూ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయలేవని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ బిజెపి మాత్రం 300కు పైగా సీట్లు గెలుచుకొని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని నేటికీ బల్లగుద్ది వాదిస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీ మోడీ దిగిపోవడం ఖాయమని నమ్మకంగా చెప్తోంది గానీ తమ పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదని గట్టిగా ఒక్కసారి కూడా చెప్పలేకపోయింది. పైగా మిత్రపక్షాల మద్దతు కూడగట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తోంది. అంటే ఓటమిని అంగీకరించినట్లే. కానీ అధికారం చేజార్చుకోదలచుకోలేదని కూడా అర్ధమవుతోంది. 

ఈసారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌, బిజెపిల వైఖరిని నిశితంగా గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైన విధానాలు కనిపిస్తాయి. గెలుపు ధీమా ప్రదర్శిస్తున్న బిజెపిలో మొదటి నుంచే ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది. తప్పకుండా ఓడిపోతుందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో మోడీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఎదురుదాడులు చేస్తూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. 

గత 5 ఏళ్ళలో ఎంతో అద్భుతమైన పాలన చేసి, అద్భుతమైన ప్రగతి సాధించామని వాదిస్తున్న బిజెపి తన ఎన్నికల ప్రచారంలో తమ ప్రభుత్వం సాధించిన ఆ ఘన విజయాల గొప్పలేవీ పెద్దగా ప్రస్తావించకుండా మొదటి నుంచే పుల్వామా దాడి, సైనికుల మృతి, ఉగ్రవాద శిబిరాలపై వాయుసేన దాడి, అయోద్య రామమందిర నిర్మాణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ ప్రజలలో సెంటిమెంటు రగిల్చి ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నించడం బిజెపిలో నెలకొన్న అభద్రతాభావానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 

సర్వేలు, మీడియా, చివరికి దేశప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని బలంగా నమ్ముతున్నప్పటికీ కాంగ్రెస్‌ పూర్తి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతుండటం విశేషం. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓడినప్పటికీ జెడిఎస్ పార్టీకి ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసి అధికారం చేజారిపోకుండా కాపాడుకొంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా అధికారం చేజిక్కించుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అందుకోసం అవసరమైతే రాహుల్ గాంధీ ప్రధాని పదవిని త్యాగం చేయడానికి వెనుకాడకపోవచ్చు. 

కనుక లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి నిజంగానే 300 సీట్లు వస్తాయా? లేక కాంగ్రెస్‌ అంచనాలు ఫలించి మిత్రపక్షాలతో అధికారం చేజిక్కించుకొంటుందా? లేక కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌తో ఏమైనా మ్యాజిక్ చేయబోతున్నారా? అనే మూడు ప్రశ్నలకు మే 23 తరువాత సమాధానాలు లభిస్తాయి. అంతవరకు వేచి చూడక తప్పదు.


Related Post