జగ్గారెడ్డి చెపుతున్నది అదేనా?

May 17, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేణుకా చౌదరి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తప్పకుండా గెలువబోతున్నారు. కానీ మాకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడమే ముఖ్యం. మాకు అవసరంపడితే తెరాస కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నాము. ఈసారి రాహుల్ గాంధీ నాయకత్వంలో కేంద్రంలో యూపీయే ప్రభుత్వం ఏర్పడటం ఖాయం,” అని అన్నారు. 

రాష్ట్రంలో ఎలాగూ కాంగ్రెస్‌ అధికారంలోకి రాలేదని తెలిసి ఉన్నప్పటికీ ‘మాకు తెలంగాణలో అధికారం ముఖ్యం కాదని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవడమే ముఖ్యమని’ జగ్గారెడ్డి చెప్పడం ఏదో మాటవరసకు అన్నట్లు భావించలేము.  కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేందుకు తెరాస సహకరిస్తుందంటే అందుకోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పణంగా పెట్టడానికి కూడా వెనుకాడకపోవచ్చునని ఆయన మాటల సారాంశంగా భావించవచ్చు. గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రయోజనాల కోసం ఏపీ కాంగ్రెస్‌ను పణంగా పెట్టింది. ఇప్పుడు అదేవిధంగా జాతీయ కాంగ్రెస్‌ ప్రయోజనాల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ను పణంగా పెట్టడానికి వెనుకాడకపోవచ్చు. జగ్గారెడ్డి అదే చెపుతున్నారనుకోవచ్చు. 


Related Post