తరువాత ప్రధాని ఎవరు?

May 17, 2019


img

ఈనెల 23న లోక్‌సభ ఫలితాలు వెలువడబోతున్నాయి. అంతకంటే ముందు ఈనెల 19న చివరిదశ పోలింగ్ ముగిసిన వెంటనే వివిద సంస్థల సర్వే ఫలితాలు వెలువడబోతున్నాయి. అంటే మే 19న కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రాబోతోందనే విషయంపై కొంత స్పష్టత వస్తుంది. ఒకవేళ కాంగ్రెస్‌, బిజెపిలు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుచేయలేని స్థితిలో ఉంటే ఎవరు ప్రధానమంత్రి అవుతారు? అనే ప్రశ్న వినిపిస్తోంది.     

దానికి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సమాధానం చెప్పారు. మే 23 తరువాత ప్రధానమంత్రి అధికార నివాసం తాళాలు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేతికి రాబోతున్నాయని అన్నారు. అంటే మమతా బెనర్జీ ప్రధానమంత్రి కావాలనుకొంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి స్పష్టంగా నొక్కి చెప్పినట్లే భావించవచ్చు. 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాన మాంత్రి కావాలని బలమైన కోరిక ఉన్నప్పటికీ, అధికారం చేజిక్కించుకోవడం కోసం అవసరమైతే  ప్రధాని పదవిని త్యాగం చేయడానికి వెనుకాడకపోవచ్చునని కాంగ్రెస్ పార్టీ సంకేతాలు ఇస్తోంది. 

కానీ కాంగ్రెస్‌ కూటమిలో భాగస్వామిగా చేరుతారనుకొంటున్న ఎస్పీ, బీఎస్పీ పార్టీలు మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరుకొంటున్నాయి. కనుక ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్న మాయావతి, మమతా బెనర్జీలలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గితే తప్ప ఈ చిక్కుముడి వీడదు. 

లోక్‌సభ ఎన్నికలలో ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలలో ఏది అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోగలదో దాని మాటే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ (42) కంటే యూపీలోనే ఎక్కువ(80) ఎంపీ సీట్లు ఉన్నాయి కనుక ఒకవేళ ఎస్పీ, బీఎస్పీలు కలిసి వాటిలో మెజార్టీ స్థానాలు గెలుచుకోగలిగితే మాయావతికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కానీ ఈ ఆశలు, లెక్కలు అన్నీ బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటేనే సాధ్యపడతాయి. 


Related Post