ప్రాజెక్టులు ఆపబోము కానీ నిర్వాసితులకు న్యాయం చేస్తాం

May 17, 2019


img

కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఏ ప్రాజెక్టును నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్వాసితులైన రైతులు, రైతు కూలీలు తదితరులు వేర్వేరుగా వేసిన 175 పిటిషన్లలో తీర్పు రిజర్వ్ అయిన మూడు కేసులు తప్ప మిగిలిన 172 కేసులను హైకోర్టు ధర్మాసనమే విచారిస్తుందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం చెప్పింది. కొద్దిమంది రైతులు, రైతు కూలీల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. 

ఈ సందర్భంగా న్యాయమూర్తుల సమక్షంలోనే మల్లన్న సాగర్ ప్రాజెక్టు క్రింద ముంపుకు గురవుతున్న ఏటిగడ్డ కిష్టాపూర్‌ నిర్వాసితులందరికీ ఒక్కొక్కరికీ ప్రభుత్వం తరపున రూ.7.50 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితుల తరపు వాదించిన న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ ‘అధికారులు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా వేధిస్తూ, వారు నష్టపరిహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని చెపుతూ కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. ఈ సమస్యను తాము హైకోర్టుకు దృష్టికి తీసుకువచ్చి కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులు చేసిందని చెప్పారు. రైతుల భూములు, ఇళ్ళు స్వాధీనం చేసుకొంటున్నట్లు ప్రభుత్వం ఇంగ్లీషులో నోటిఫికేషన్‌ ఇస్తుండటంతో అది అర్ధం కాక రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని న్యాయస్థానానికి వివరించడంతో రాష్ట్రంలో నిర్మించబడుతున్న అన్ని ప్రాజెక్టులలో నిర్వాసితులకు పూర్తి న్యాయం, సకాలంలో తగిన నష్టపరిహారం, పునరావాసం దక్కేలా చేస్తామని, ఆ బాధ్యత తాము తీసుకొంటామని హైకోర్టు ధర్మాసనం హామీ ఇచ్చింది. ఇక నుంచి రైతులకు తెలుగులోనే ఉత్తర్వులు అందజేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూసేకరణ చేయడాన్ని అడ్డుకోలేమని, కనుక ముందుగా ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారాన్ని తీసుకొని ఆ తరువాత అవసరమనుకొంటే న్యాయపోరాటం చేయాలి తప్ప నష్టపరిహారం తీసుకోకుండా  పోరాడటం వలన రైతులే నష్టపోతారని హైకోర్టు సలహా ఇచ్చింది. అయితే నష్టపరిహారం విషయంలో రైతులు అత్యాశకు పోకుండా సముచిత పరిహారాన్ని మాత్రమే ఆశించాలని సలహా ఇచ్చింది.


Related Post