బిజెపియేతర కూటమికే మద్దతు ఇస్తాం కానీ...సురవరం

May 17, 2019


img

కాంగ్రెస్‌, బిజెపిలు తప్ప దేశంలో దాదాపు అన్ని పార్టీలు ఈసారి కేంద్రంలో ‘హంగ్’ ఏర్పడబోతోందని గట్టిగా నమ్ముతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే సిఎం కేసీఆర్‌ ఈవిషయం చెప్పగా, లోక్‌సభ ఎన్నికలు చివరి దశ పోలింగ్ జరుగకముందే దేశంలో దాదాపు అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఈసారి కేంద్రంలో ‘హంగ్’ ఏర్పడబోతోందని గట్టిగా చెపుతున్నాయి. 

సిపిఐ జాతీయనేత సురవరం సుధాకర్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ఈసారి కేంద్రంలో తప్పకుండా ‘హంగ్’ ఏర్పడబోతోంది. మేము బిజెపియేతర కూటమికే మద్దతు ఇస్తాము. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం సిఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాలకు వెళ్ళి కలుస్తున్న నేతలందరూ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నవారో లేదా దానితో కలిసి పనిచేయాలనుకొంటున్నవారే కనుక ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరేవారెవరూ ఉండరు. మోడీకి ఆయనకు మద్య రహస్య అవగాహన ఉందా లేదా? మోడీ ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకే ఆయన ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టాలనుకొంటున్నారా?అనే విషయాల గురించి నాకు తెలియదు కనుక నేను మాట్లాడను. కానీ గత ఐదేళ్ళలో మోడీ ప్రభుత్వానికి కేసీఆర్‌ అండగా నిలబడ్డారనే సంగతి అందరికీ తెలుసు,” అని అన్నారు. 

సురవరం సుధాకర్ రెడ్డి మాటల సారాంశం ఏమిటంటే, సిపిఐ ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరబోవడంలేదని...బిజెపికు మద్దతు ఇవ్వబోదు కనుక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుందని స్పష్టం అవుతోంది. సిపిఐతో పాటు సిపిఎం కూడా కాంగ్రెస్ కూటమికే మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని భావించవచ్చు. 


Related Post