అలా చేస్తే బెంగాలీలు ఒట్లేస్తారా?

May 16, 2019


img

ఈనెల 19న చివరిదశ పోలింగ్ జరుగనుంది. కనుక నిబందనల ప్రకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. కానీ కోల్‌కతాలో అమిత్ షా ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింస కారణంగా ఈరోజు రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచార సమయాన్ని కుదిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించింది. దీనిపై వివిద రాష్ట్రాలలోని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అన్ని రాష్ట్రాలలో ఇటువంటి చెదురుముదురు ఘటనలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా ఈవిధంగా ఒకరోజు ముందుగానే ఎన్నికల ప్రచారంపై నిషేదం విధించలేదు. కానీ కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రధాని మోడీ కనుసన్నలలో పనిచేస్తున్న కారణంగానే పశ్చిమబెంగాల్లో మాత్రమే ఎన్నికల ప్రచారం గడువును కుదించిందని మమతా బెనర్జీతో సహా పలు ప్రాంతీయ పార్టీల అధినేతలు విమర్శించారు. 

ఒకవేళ ఎన్నికల ప్రచారం గడువు కుదించాలనుకొంటే ఆనవాయితీ ప్రకారం సాయంత్రం 5 గంటలకు ముగించాలి కానీ ఇవాళ్ళ రాత్రి ప్రధాని నరేంద్రమోడీ పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచార సభలలో పాల్గొనబోతున్నారు కనుక ఆయన కోసమే రాత్రి 10 గంటల నుంచి దీనిని అమలుచేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. 

39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 18న ఒకే ఒక దశలో ఎన్నికలు నిర్వహించగా, కేవలం మరో 3 సీట్లు ఎక్కువగా అంటే 42 సీట్లున్న పశ్చిమబెంగాల్లో మాత్రం 7 దశలలో పోలింగ్ నిర్వహిస్తుండటాన్ని కూడా మమతా బెనర్జీతో సహా ప్రతిపక్ష పార్టీలన్నీ తప్పుపడుతున్నాయి. ఈ ఎన్నికలలో ఎలాగైనా పశ్చిమబెంగాల్ రాష్ట్రంపై పట్టు సాధించాలనే ఉద్దేశ్యంతోనే మోడీ ప్రభుత్వం ఏడు దశలలో ఎన్నికలు జరిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

కానీ ప్రశాంతంగా పోలింగ్ జరిపేందుకే ఏడు దశలలో ఎన్నికలు నిర్వహిస్తున్నామని కేంద్ర ఎన్నికల కమీషన్ వాదనను కూడా ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. మరి అటువంటప్పుడు నిన్న కోల్‌కతాలో హింస చెలరేగకుండా భద్రతాదళాలను ఎందుకు మోహరించలేదని నిలదీస్తున్నాయి. 

అమిత్ షా ర్యాలీపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేయడం ఎంత తప్పో, అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్ రాష్ట్రంపై ఈవిధంగా కక్షగట్టినట్లు వ్యవహరించడం కూడా అంతకంటే పెద్ద తప్పు. ఎన్నికలలో గెలవాలంటే ప్రజలు మనసులు గెలుచుకోవాలి కానీ వారికి ఆగ్రహం కలిగేవిధంగా వ్యవహరించకూడదు. తప్పులు చేసి వాటిని ప్రత్యర్దులపైకి నెట్టేస్తే ప్రజలు గమనించలేరనుకొంటే అవివేకమే అవుతుందని గ్రహిస్తే మంచిది. 


Related Post