అది మాకు ఎదురుదెబ్బ కాదు: తెరాస

May 16, 2019


img

సిఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను డిఎంకె పార్టీ అధినేత స్టాలిన్‌ సున్నితంగా తిరస్కరించడంపై తెరాస తరపున ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. 

“తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంటున్న డిఎంకె పార్టీ ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరలేమని చెప్పడం మాకు ఎదురుదెబ్బగా భావించడం లేదు. ఆ సమాధానం ఊహించినదే కానీ లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత దేశంలో రాజకీయ పరిస్థితులు మారుతాయి కనుక ప్రాంతీయ పార్టీలన్నిటినీ చైతన్యపరిచి ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చి రాష్ట్రాల హక్కులను కాపాడుకోవాలనే ప్రయత్నంలోనే కేసీఆర్‌ స్టాలిన్‌ను కలిశారు. అదే ఉద్దేశ్యంతో సిఎం కేసీఆర్‌ కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో కూడా పర్యటించి అక్కడి ప్రాంతీయ పార్టీల అధినేతలతో మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలన్నీ సంఘటితంగా ఉన్నట్లయితే, లోక్‌సభ ఫలితాల తరువాత జాతీయపార్టీలే మద్దతు కోసం మన వద్దకు రావాలి తప్ప మనమే వాటి చుట్టూ తిరుగకూడదనేది కేసీఆర్‌ అభిప్రాయం. లోక్‌సభ ఫలితాలలో కాంగ్రెస్‌, బిజెపిలలో దేనికీ పూర్తి మెజారిటీ రాదని మేము భావిస్తున్నాము. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని స్థితిలో అవి తప్పనిసరిగా మా వద్దకే రావాలి. వాటికి మేమైన మద్దతు ఇవ్వాలి లేదా అవి మాకైనా మద్దతు ఇవ్వక తప్పదు. కనుక అవి మేము చెప్పినట్లు వినక తప్పదు. అప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ప్రాంతీయ పార్టీలకు పట్టు ఏర్పడుతుంది. కనుక ప్రాంతీయ పార్టీలు ఒక్కటిగా నిలబడటం చాలా అవసరం,” అని అన్నారు.  

అసెంబ్లీ ఎన్నికల సమయంలో “కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌” ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొన్న తెరాస నేతలు లోక్‌సభ ఎన్నికలోచ్చేసరికి మాట మార్చి “16 సీట్లు సాధిస్తే డిల్లీలో మేమే చక్రం తిప్పుతాము...కేంద్రం మెడలు వంచుతాము...సారు కారు పదహారు” అని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు తుది దశకు చేరుకొనేసరికి “కాంగ్రెస్‌, బిజెపిలలో దేనికి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే శక్తి ఉంటే దానికి మద్దతు ఇస్తామని లేదా వాటిలో ఏది ముందుకు వస్తే దాని మద్దతు తీసుకొంటామని చెప్పడం” ‘గుణాత్మకమైన మార్పు’గానే చెప్పవచ్చు.

జాతీయ రాజకీయాలలో ‘గుణాత్మకమైన మార్పు’ సాధిస్తామని చెప్పుకొన్న తెరాసలోనే ఫలితాలు వెలువడక మునుపే ఇంత గుణాత్మకమైన మార్పులు కనబడటం చాలా ఆశ్చర్యంగానే ఉంది. లోక్‌సభ ఫలితాలు వెలువడిన తరువాత తెరాసలో ఇంకా ఎంత గుణాత్మకమైన మార్పు వస్తుందో చూడాలి.


Related Post