రామోజీరావుతో బాబు భేటీ దేనికో?

May 16, 2019


img

ఏపీ సిఎం చంద్రబాబునాయుడు బుదవారం మధ్యాహ్నం అమరావతి నుంచి హెలికాప్టర్‌లో నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చి ఈనాడు ఛైర్మన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరసేపు వారి సమావేశం కొనసాగింది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు, ఫలితాలు, తదనంతర పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కానీ చంద్రబాబునాయుడు అంతకంటే చాలా ముఖ్యమైన పనిపై రామోజీరావును కలిశారని సమాచారం. 

చిక్కుల్లో పడిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ను కాపాడేందుకే చంద్రబాబు రంగంలో దిగారని సాక్షి మీడియా అనుమానం వ్యక్తం చేసింది. టీవీ9 కొత్త యాజమాన్యంలో ప్రధానభాగస్వామిగా ఉన్న రామేశ్వరరావుతో రామోజీరావుకు సన్నిహిత సంబందాలున్నందున రామోజీరావు ద్వారా ఆయనపై ఒత్తిడి చేసి రవిప్రకాశ్‌పై వేసిన కేసులను ఉపసంహరింపజేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు సాక్షి పేర్కొంది. 

గతంలో రవిప్రకాశ్‌ టీవీ9 న్యూస్ ఛానల్ ద్వారా వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కొన్ని వార్తాకధనాలు ప్రసారం చేసి తోడ్పడ్డారు కనుక ఇప్పుడు చంద్రబాబునాయుడు రవిప్రకాశ్‌ను ఈ కేసుల గొడవ నుంచి బయటపడేసి ఆ రుణం తీర్చుకోవాలనుకొంటున్నారని సాక్షి మీడియా పేర్కొంది. 

సిఎం కేసీఆర్‌ సన్నిహితుడిగా పేరున్న రామేశ్వరరావు టీవీ9 స్వాధీనం చేసుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నించారని, కానీ అందుకు తాను అంగీకరించకపోవడంతో చివరికి దొడ్డిదారిలో టీవీ9లోకి ప్రవేశించి తనను బయటకుపంపించేశారని రవిప్రకాశ్‌ స్వయంగా ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి కూడా ఇంచుమించు అటువంటి ఆరోపణలే చేశారు. టీవీ9 తెరాస సర్కారును నిలదీస్తోంది కనుక దాని గొంతును అణచివేయడానికే రామేశ్వరరావు రంగప్రవేశం చేసి టీవీ9ను స్వాధీనం చేసుకొన్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ వాదనలు నిజమో కాదో కాలమే చెపుతుంది.


Related Post