కేసీఆర్‌ మైండ్ గేమ్‌కు దెబ్బైపోయాము: లక్ష్మణ్

May 15, 2019


img

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ బుదవారం ఒక ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో “రాష్ట్రంలో బిజెపి దెబ్బ తినడానికి కారణం ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి సిఎం కేసీఆర్‌తో స్నేహం చేయడమే కారణమా? లేక మీ నాయకత్వ లోపమా?” అనే సూటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కె.లక్ష్మణ్ కాస్త ఇబ్బందిపడ్డారు.

“పార్టీల రాజకీయాలను, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మద్య సంబంధాలను ఒకటిగా అనుకోరాదు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం సహకరించాలి కనుక సహకరిస్తోంది. కానీ ఇక్కడ మేము, మా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెరాస సర్కారును గట్టిగా నిలదీస్తున్నాము. పోరాడుతూనే ఉన్నాము. 

నోట్లరద్దు, జిఎస్టి వంటి కొన్ని అంశాలలో తెరాస మా ప్రభుత్వానికి అండగా నిలబడిన మాట వాస్తవం. ఆ కారణంగా తెరాస-బిజెపిల మద్య లోపాయికారి ఒప్పందం ఉందనే అపోహ ప్రజలలో నెలకొన్న మాట కూడా వాస్తవం. దానిని సిఎం కేసీఆర్‌ బాగా పెంచి పోషించారు. కేసీఆర్‌ ఆడిన ఈ మైండ్ గేమ్ వలన మేము నష్టపోయాము. 

అసెంబ్లీ ఎన్నికలలో కూడా కేసీఆర్‌ మైండ్ గేమ్ ఆడారు. రాష్ట్రానికి సంబందించిన అంశాలు, సమస్యలపై చర్చ జరగకుండా...తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు చంద్రబాబునాయుడును బూచిగా చూపించి తెలంగాణ ప్రజలలో మళ్ళీ సెంటిమెంటు రగిల్చి విజయం సాధించగలిగారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తెరాస ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసిన మూడు స్థానాలలో ఓడిపోయింది. లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్ళీ సత్తా చాటబోతోంది,” అని సమాధానం చెప్పారు. 

కేసీఆర్‌ కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి ఆ పార్టీలను బలహీనపరిస్తే, మోడీతో సన్నిహితంగా మెలగడం ద్వారా రాష్ట్ర బిజెపి విశ్వసనీయతను దెబ్బ తీశారని చెప్పవచ్చు. ప్రధాని మోడీ-కేసీఆర్‌ దోస్తీ రాష్ట్ర బిజెపికు శాపంగా మారుతుందని మైతెలంగాణ.డాట్ కామ్ మొదటి నుంచి చెపుతూనే ఉంది. నేడు కె.లక్ష్మణ్ అదే చెప్పారు. కానీ ఆయన తమ అధిష్టానాన్ని వేలెత్తి చూపలేరు కనుక కేసీఆర్‌ మైండ్ గేమ్‌కు బలైపోయామని సర్దిచెప్పుకొంటున్నారు అంతే!


Related Post