కేసీఆర్‌ మద్దతు మాకే: కాంగ్రెస్‌

May 14, 2019


img

లోక్‌సభ ఎన్నికలు మొదలుకాక మునుపు తామే తప్పకుండా గెలువబోతున్నామని కాంగ్రెస్‌, బిజెపిలు గట్టిగా చెప్పాయి. కానీ ఎన్నికలు చివరిదశకు వచ్చేసరికి మిత్రపక్షాల మద్దతు అవసరం పడుతుందని చెప్పుకొంటున్నాయి. అంటే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని ఆ రెండు పార్టీలు గ్రహించినట్లు లేదా అంగీకరించినట్లు స్పష్టం అవుతోంది. 

కేసీఆర్‌-స్టాలిన్ భేటీపై ఇవాళ్ళ ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న శర్మ అనే ఒక కాంగ్రెస్‌ నేత ‘జగన్, కేసీఆర్‌ ఇద్దరూ తప్పకుండా తమ పార్టీకే మద్దతు ఇవ్వబోతున్నారని’ నమ్మకంగా చెప్పారు. అందుకు బలమైన కారణాలు కూడా చెప్పారు. 

“ఏ‌పీకి ఎవరు ప్రత్యేకహోదా ఇస్తే వారికి మద్దతు ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి చాలాసార్లు చెప్పారు. ఒకవేళ కేంద్రంలో బిజెపి మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇవ్వదు కనుక హోదా ఇస్తామని చెపుతున్న మా కాంగ్రెస్ పార్టీకే జగన్ మద్దతు ఇవ్వడం ఖాయం.” 

“అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇమ్మని ప్రధాని నరేంద్రమోడీని తెరాస ఎంపీలు, సిఎం కేసీఆర్‌ ఎన్నిసార్లు వేడుకొన్నా ఇవ్వలేదు. మళ్ళీ బిజెపి అధికారంలోకి వచ్చినా ఇవ్వదు కానీ మేము ఇస్తామని హామీ ఇస్తే కేసీఆర్‌ మాకే మద్దతు ఇస్తారు కదా? కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి మేలు కలుగుతుంది కనుక మాకు సంతోషమే. దానికి మేము సహకరిస్తామంటే కేసీఆర్‌ కూడా సంతోషంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారనే మేము భావిస్తున్నాము,” అని సదరు కాంగ్రెస్‌ నేత అన్నారు. 

మీడియా చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేత శర్మ చెప్పినది సహేతుకంగానే కనిపిస్తోంది. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తున్న కేసీఆర్‌ జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారా? లేదా? అసలు ఆ అవసరం పడుతుందా లేదా? అనే ప్రశ్నలకు మే 23 తరువాత సమాధానాలు లభిస్తాయి.


Related Post