కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించేనా?

May 14, 2019


img

ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం సిఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలలో ఇంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఒకటే సానుకూలంగా స్పందించింది. నిన్న చెన్నైలో డిఎంకె అధినేత స్టాలిన్‌తో జరిపిన చర్చల అనంతరం ఇరువురు నేతలు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో వారి చర్చలు ఫలించలేదని భావించవచ్చు. వారి భేటీపై మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరవలసిందిగా సిఎం కేసీఆర్‌ డిఎంకె అధినేత స్టాలిన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నించగా, మీరే కాంగ్రెస్ కూటమిలో చేరవలసిందిగా స్టాలిన్ కోరినట్లు ఆ వార్తా సారాంశం. రాష్ట్రంలో కాంగ్రెస్‌-డిఎంకె పార్టీలు పొత్తులు పెట్టుకొన్నాయని, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వాలనుకొంటున్నట్లు స్టాలిన్ స్పష్టంగా చెప్పారని డిఎంకె అధికార ప్రతినిధి శరవణన్‌ అన్నాదురై ట్వీట్ చేశారు. 

తమిళనాడు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌-డిఎంకె పార్టీలు పొత్తులు పెట్టుకొన్నాయనే సంగతి కేసీఆర్‌కే కాదు... సామాన్య ప్రజలకు కూడా తెలుసు. అయినప్పటికీ డీఎంకె పార్టీని ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరేందుకు స్టాలిన్‌ను ఒప్పించగలమనే నమ్మకంతోనో లేక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీకి చేరువయ్యేందుకో కేసీఆర్‌ కాంగ్రెస్‌ మిత్రపక్షాల నేతలతో వరుస భేటీ అవుతున్నారనుకోవలసి ఉంటుంది. 

కేరళ, చెన్నై తరువాత సిఎం కేసీఆర్‌ మళ్ళీ మరోసారి బెంగళూరు వెళ్ళి జెడిఎస్ అధినేతలు దేవగౌడ, కుమారస్వామిని కలువబోతున్నట్లు సమాచారం. కానీ కర్ణాటకలో జెడిఎస్-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది కనుక వారు కూడా ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరేందుకు నిరాకరించడం ఖాయమనే భావించవచ్చు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్, యూపీలోని ఎస్పీ, బీఎస్పీలు కూడా తమ రాజకీయ ప్రయోజనాలు, అధికారమే లక్ష్యంగా వ్యవహరిస్తాయి కనుక అవి కూడా ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరుతాయనే నమ్మకం లేదు. రాజకీయ దురందురుడైన సిఎం కేసీఆర్‌కు ఈ వాస్తవ రాజకీయ పరిస్థితులు, ఈ రాజకీయ సమీకరణలు తెలియవనుకోలేము. కానీ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తెలుస్తుంది.


Related Post