ఆ సమావేశానికి కేసీఆర్‌ హాజరు కారు: వినోద్ కుమార్

May 11, 2019


img

ఈనెల 19న లోక్‌సభ ఎన్నికలకు చివరిదశ పోలింగ్ ముగుస్తుంది. కనుక భవిష్య కార్యాచారణ గురించి చర్చించుకొనేందుకు దేశంలో ప్రతిపక్షపార్టీల అధినేతలు మే 21న డిల్లీలో సమావేశం కానున్నారు. దానిలో ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వాములుగా జేరుతాయని భావిస్తున్న జేడీయూ (కర్ణాటక), తృణమూల్ కాంగ్రెస్ (పశ్చిమబెంగాల్), ఎస్పీ, బీఎస్పీ (ఉత్తరప్రదేశ్), నేషనల్ కాన్ఫరెన్స్ (జమ్ముకశ్మీర్‌), టిడిపి (ఆంధ్రప్రదేశ్‌), డిఎంకె (తమిళనాడు), 22 ప్రాంతీయపార్టీలు పాల్గొనబోతున్నాయి. ఆ సమావేశానికి కాంగ్రెస్‌, వామపక్షాలు కూడా హాజరుకావచ్చునని సమాచారం. 

ఆ సమావేశంలోనే ప్రధాని అభ్యర్ధి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఖరారు చేయలేకపోయినా ఆ సమావేశానికి హాజరైన అన్ని పార్టీలు ‘తమను ఒకే కూటమిగా గుర్తించాలని, దానికే తాము మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తూ’ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ ఈయనున్నాయి. కనుక 21న జరుగబోయే ఆ సమావేశం చాలా కీలకమైనదని అర్దం అవుతోంది. కానీ ఆ సమావేశానికి కేసీఆర్‌ హాజరుకాబోరని ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే కేసీఆర్‌ ఆ సమావేశానికి హాజరుకావడం లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. 

చంద్రబాబునాయుడు పూనుకొని దేశంలో ప్రాంతీయపార్టీలన్నిటినీ కూడగట్టి ఆ సమావేశం ఏర్పాటు చేస్తున్నప్పటికీ, లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి ఓటమి ఖాయమని ఆ తరువాత రాజకీయాలలో ఆయన పాత్ర నామమాత్రంగా మారబోతోందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతనే ప్రాంతీయ పార్టీలు ఎటువైపు ఉంటాయో స్పష్టత వస్తుందని అన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం కేసీఆర్‌ చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. 


Related Post