టీవీ-9కు రవిప్రకాష్ గుడ్ బై!

May 10, 2019


img

తెలుగు మీడియా కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేసిన టీవీ-9 న్యూస్ ఛానల్ వ్యవస్థాపకుడు రవిప్రకాష్ శుక్రవారం సాయంత్రం టీవీ-9కు గుడ్ బై చెప్పేశారు. మీడియాను నియంత్రించే ప్రయత్నంలో కొందరు రాజకీయనాయకులు టీవీ-9లోకి కొందరు వ్యక్తులను దొడ్డిదారిలో పంపించారని, వారు తనను బయటకు పంపించడానికి కుట్రలు పన్నారని, తనపై తప్పుడు కేసులతో వేదిస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితులలో టీవీ-9 వీడవలసి వస్తున్నందుకు తనకు చాలా బాధగా ఉందని అన్నారు. సాటి మీడియా ఛానల్స్ కూడా నిజానిజాలు తెలుసుకోకుండా తనపై కక్ష కట్టినట్లు వ్యవహరించడం చాలా బాధ కలిగించిందని అన్నారు.

 ఈ సందర్భంగా రవి ప్రకాష్ బోర్డు సభ్యులను ఉద్దేశ్యించి ఒక బహిరంగ లేఖ వ్రాశారు. అది ఆయన మాటలలోనే...       వెనుకదారిలో అక్రమంగా ప్రవేశించిన బోర్డు సభ్యులకు.. “నేను.. రవిప్రకాష్.. టీవీ9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాల్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే టీవీ9 పని పట్టాలని ఈ చర్యలకు దిగారు. అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో టీవీ9 సంస్థలోకి జొరబడ్డారు. ఎన్‌సిఎల్‌టి కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు. ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఎబిసిఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో టీవీ9ని కంట్రోల్‌లోకి తీసుకున్నారు.

తప్పుడు కంప్లయింట్స్‌తో, తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో చేశారు. పోలీసులను యధేచ్చగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసుల దాడులకు గురి చేసి భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు. మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్‌గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. దేశంలో జర్నలిజాన్ని కాపాడటానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్నినిలువరించటానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది,” అని వ్రాశారు. 


Related Post